Hyderabad : ఆకలితో అలమటించిందామె. కనీసం ఇద్దరు పిల్లలకు ఒక పూట తిండి అయినా పెట్టలేకపోయింది. చేతిలో చిల్లిగవ్వలేదు.. ఎవరినైనా డబ్బులు అడగాలంటే ఆత్మాభిమానం అడ్డొచ్చింది. అడిగినా ఇస్తారో.. ఇవ్వరో అనేది అనుమానమే. దీంతో మానసికంగా కుంగిపోయిన ఆమె ఆకలిని తట్టుకోలేక అస్వస్థతకు గురైంది. చివరకు నిద్రలోనే తుది శ్వాస విడిచింది. తల్లి మృతితో ఏం చేయాలో ఆమె కూతుళ్లకు తోచలేదు. ఈ విషయం ఎవరికీ చెప్పలేదు ఆ అమాయక పిల్లలు. తొమ్మది రోజులపాటు ఆకలితో అలమటిస్తూ తల్లి శవంతోనే ఉన్నారు. హైదరాబాద్‌లో చోటుచేసుకున్న ఈ హృదయ విదారక సంఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
కష్టాలు ఎదురయ్యాయి ఇలా..
Hyderabad ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేసే రాజు, లలిత (45) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు రవళిక, యశ్విత ఉన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిసరాల్లోనే ఈ కుటుంబం నివసించేది. 2020లో రాజు, లలిత మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో రాజు ఇల్లు వదిలి ఎటో వెళ్లిపోయాడు. దీంతో లలిత ఇద్దరు పిల్లలను తల్లి వద్దకు వెళ్లిపోయింది. భార్త రాజు వెళ్లిపోయిన తర్వాత లలిత ఇంటి అవసరాలను తీర్చేందుకు ఆమె తల్లి సహాయపడుతూ వచ్చింది. ఇదే క్రమంలో ఆరు నెలల క్రితం లలిత తల్లి మృతి చెందింది. దీంతో లలిత మరింత మానసిక వేదనకు గురైంది.
ఆకలిని తట్టుకోలేక…
తన తల్లి మరణంతో లలితకు మరింత ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. పిల్లలను పోషించేందుకు ఎలాంటి ఆదాయం లేకపోవడంతో దిక్కు తోచని స్థితికి చేరుకుంది. కనీసం ఒక పూట తిండి కూడా లభించని పరిస్థికి ఆ కుటుంబం చేరుకుంది. దీంతో లలిత అనారోగ్య బారిన పడింది. ఈ క్రమంలో నిద్రలోనే ఆమె కన్నుమూసింది.
దిక్కు తోచని స్థితిలో కూతుళ్లు
తల్లి మృతి చెందడంతో కూతుళ్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అంత్యక్రియలు చేయడానికి డబ్బులు లేకపోవడంతో తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచారు. ఈ విషయం బయట ఎవరితోనూ చెప్పలేదు. తొమ్మిది రోజుల పాటు తిండి కూడా తినకుండా బాధలో మునిగిపోయారు. ఇంట్లోంచి దుర్వాసన రావడంతో పక్కింటి వారికి అనుమానం వచ్చింది. ఇంటి యజమాని అక్కడికి వచ్చి వాకబు చేయగా లలిత ఆయనకు కనిపించలేదు. కుమార్తెలు ఏమీ చెప్పకపోవడంతో స్థానికులు మరింత ఆందోళన చెందారు. చివరకు రవళిక, యశ్విత తమ తల్లి మరణం గురించి పక్కవాళ్లకు చెప్పారు.
పోలీసుల విచారణ
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కుమార్తెలు ఇచ్చిన సమాధానాలు పొంతన లేకుండా ఉండటంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. లలితది సహజ మరణమా? లేక మరేదైనా కారణమా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. అంబర్‌పేట్‌లో ఉంటున్న లలిత సోదరుడిని రప్పించిన పోలీసులు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఒప్పించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..