Hyderabad | మొంథా తూపాన్ (Cyclone Montha) తీవ్ర వాయుగుండంగా మారి దక్షిణ భారతదేశంలో కుంభవృష్టి కురిపిస్తోంది. తెలంగాణలో కూడా తుఫాను ప్రభావం పెరుగుతోందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరం దాటిన మొంథా తుఫాన్ భద్రాద్రి కొత్తగూడం మార్గంగా తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఉదయం నుంచే భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) రాష్ట్ర అధికారులకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్ (Warangal) , నల్గొండ జిల్లాల్లో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండటంతో అక్కడి కలెక్టర్లు, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలతో సమన్వయంతో నిరంతరం పర్యవేక్షించాలని చెప్ఆపరు.
సీఎం రేవంత్‌రెడ్డి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, వర్షాల ప్రభావం, నష్టాలపై అత్యవసరంగా చేపట్టాల్సిన పనులపైసమీక్షించారు. పంటలు, ధాన్యం నిల్వలు నష్టపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన వ్యవసాయ అధికారులను ఆదేశించారు. పత్తి, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తాత్కాలిక షెడ్లు, నీటి పారుదల చర్యలు చేయాలని సూచించారు.
మరోవైపు తుఫాన్ ప్రభావంతో గోల్కొండ, కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లు నిలిచిపోవడం, పలు రైళ్లు మార్గం మళ్లించబడిన నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేయాలని రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలని, చెరువులు, రిజర్వాయర్ల వద్ద నీటి మట్టాన్ని నిరంతరం పరిశీలించాలని సూచించారు. పూర్తిగా నిండిన చెరువుల వద్ద ఇసుక బస్తాలు సిద్ధం ఉంచాలని, వాగులు పొంగి ప్రవహించే ప్రాంతాల్లో రాకపోకలను నిలిపివేయాలని చెప్పారు. అలాగే పారిశుద్ధ్య చర్యలు నిరంతరం కొనసాగించాలని, వైద్య శాఖ తగిన మందులు, వైద్య శిబిరాలు సిద్ధం ఉంచాలని సీఎం ఆదేశించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, ప్రభుత్వ సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															







 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    