Darshanam Mogilaiah : టాలీవుడ్ సినిమా బలగం ఫేమ్, ప్రముఖ జానపద కళాకారుడు దర్శనం మొగిలయ్య ఇక లేరు. దీర్ఘకాలిక అనారోగ్యంతో ఈ రోజు ఉదయం మృతి చెందారు. వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. నిరుపేద కుటుంబానికి చెందిన మొగిలయ్య చాలా కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. చికిత్స చేయించుకొనేందుకు చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో మొగిలయ్యకు దర్శకుడు వేణు, ఆయన టీమ్ అండగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్థిక సాయం అందించింది. దీంతో వైద్యం చేయించుకుంటున్న మొగిలయ్య నాలుగు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. చికిత్స అందిస్తున్న క్రమంలోనే కన్నుమూసారు.
Balagam Mogilaiah పాపులారిటీ..
మొగిలయ్య ‘కిన్నెర’ కళాకారుడిగా గుర్తింపు పొందారు. అంతరించుకుపోతున్న ఈ కళను కాపాడుకోవాలనే ఆయన తాపత్రాయపడ్డారు. బలగం సినిమా(Balagma Movie ) తో ఆయన బహు ప్రాచుర్యం పొందారు. భీమ్లా నాయక్ చిత్రంలో టైటిల్ పాటనూ పాడారు. మొగిలయ్య చేసిన విశేష సేవలకు కేంద్ర ప్రభుత్వం ఆయన్ను 2022లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
చిరుప్రాయం నుంచి ప్రయాణం
దర్శనం మొగిలయ్య 1951లో తెలంగాణ రాష్ట్రం నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం ఔసలికుంట గ్రామంలోని ఒక దళిత కుటుంబంలో జన్మించారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో స్థిర పడ్డారు. బాల్యంలోనే తండ్రి ఎల్లయ్య నుంచి కిన్నెర అనే వాద్యాన్ని మొగిలయ్య నేర్చుకున్నారు. ఎనిమిదేళ్ల వయసులోనే ఆయన సంగీత ప్రయాణం ప్రారంభమైంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు తన తండ్రి వెంట వెళ్లి ప్రదర్శనలు ఇచ్చారు.
కిన్నెరకు కొత్త రూపు
‘కిన్నెర’ అనేది ప్రాచీనమైన తంతు వాద్యం. ఇది దక్షిణ భారతదేశంలోని దళిత సామాజికవర్గంలోని చెంచు, మాదిగ తదితర తెగలలో ఇది ప్రాచుర్యం పొందింది. నాలుగో శతాబ్దం నుంచి వాడుకలో ఉంది.
మొగిలయ్య తన సృజనాత్మకతతో దీనికి కొత్తరూపు ఇచ్చారు. ఈ వాద్యంలో 12 మెట్ల (సపోర్ట్ స్టెప్పులు)ను తయారు చేసి వినూత్న రీతిలో తీర్చిదిద్దారు. ఇది భారతీయ జానపద సంగీతానికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. మొగిలయ్య తండ్రి తొమ్మిది మెట్ల కిన్నెరను రూపొందించారు. మొగిలయ్య 12 మెట్ల కిన్నెరను రూపొందించిన మొట్టమొదటి, ఏకైక కళాకారుడు.
కష్టాలు ఎదుర్కొన్న ‘పద్మశ్రీ’
మొగిలయ్య ఆర్థిక కష్టాల్ని ఎదుర్కొంటూ రోజువారీ కూలి పనులు చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకున్నారు. దీంతోపాటే తన కళను కూడా కొనసాగించారు. చారిత్రక ఘటనలు, సామాజిక రుగ్మతలను తన కిన్నెర వాద్యంతో ప్రజల ముందుకు తెచ్చారు. ఇదే క్రమంలో వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమాలోని ఓ పాటతో మరింత పాపులర్ అయ్యారు. తన అసాధారణ కళాసేవలకు గుర్తింపుగా ‘పద్మశ్రీ’ పురస్కారం అందుకున్న మొగిలయ్యకు ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతూనే ఉండేవి. 2024లో కూడా ఆయన హైదరాబాద్ సమీపంలో కూలి పనులు చేస్తూ కనిపించారని వార్తలు వెలువడ్డాయి. ఆయన కష్టాల గురించి తెలుసుకున్న వారికి ఇది తీవ్రంగా కలచివేసింది. సంప్రదాయ కళలను కాపాడుకుంటున్న పడుతున్న ఆర్థిక ఇబ్బందులకు మొగిలయ్య జీవితమే నిదర్శనమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది.
వారసత్వ సంపదను కాపాడుకున్న కుటుంబం
తెలంగాణ జానపద సాంస్కృతిక వారసత్వాన్ని మనుగడలో ఉంచడంలో మొగిలయ్య పేరు సువర్ణాక్షరాల్లో లిఖించబడింది. ఆయన పూర్వీకులు 400 సంవత్సరాల క్రితం వనపర్తి రాజుల కోర్టులో కిన్నెర వాయిద్యాన్ని ప్రదర్శించేవారు. వారసత్వంగా వచ్చిన ఈ కళను బతికించుకొనేందుకు మొగిలయ్య చివరి వరకు కృషి చేశారు. ఆయన కుమారుడు మహేందర్ తన తండ్రితో కలిసి దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో కిన్నెర ప్రదర్శనలు ఇచ్చారు. ఇప్పుడాయన తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించనున్నాడు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








