Death sentence : విదేశాల్లో ఉన్న భారతీయుల్లో 49 మంది భారతీయులు మరణ శిక్ష (Indians face Death sentence ) ను ఎదుర్కొంటున్నారు. సౌదీ అరేబియా (Saudi Arabia), యులైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) సహా మొత్తం ఎనిమిది దేశాల్లో మన భారతీయులు మరణ శిక్షను ఎదుర్కొంటున్నారని కేంద్ర ప్రభుత్వం (Indian government) వెల్లడించిన తాజా నివేదిక చెబుతోంది. మొత్తం 10,152 మంది భారతీయులు విదేశాల్లో జైళ్లలో ఉన్నారని తెలిపింది. వీరిలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలతోపాటు విచారణలో ఉన్నవారు కూడా ఉన్నారని వెల్లడించింది.
Death sentence : యుఏఈలోనే ఎక్కువ
భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ అందించిన సమాచారం ప్రకారం.. మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయుల్లో అత్యధికులు UAE లో ఉన్నారు. మొత్తం 25 మంది భారతీయులు అక్కడ మరణశిక్షను ఎదుర్కొంటున్నారు. అయితే, ఇప్పటివరకు వీరి శిక్ష అమలుకు సంబంధించిన అధికారిక ప్రక్రియలు పూర్తికాలేదని తెలిపారు. సౌదీ అరేబియాలో 11 మంది భారతీయులు మరణశిక్ష ఎదుర్కొంటున్నారు. మలేషియాలో ఆరుగురు, కువైట్‌లో ముగ్గరు, ఇండోనేషియా, ఖతార్, అమెరికా, యెమెన్‌లలో ఒక్కొక్కరికి మరణశిక్ష పడింది.
కేంద్రం ఏం చేస్తోంది?
విదేశాల్లో ఉన్న భారతీయుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం వివిధ విధానాలను అమలు చేస్తోంది. ముఖ్యంగా విదేశాల్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయులకు సహాయం అందించేందుకు నిరంతరం ప్రయత్నిస్తోంది. జైళ్లలో ఉన్న భారతీయులకు న్యాయపరమైన సహాయం అందించడం, వారి శిక్షను తగ్గించేందుకు లేదా విడుదల చేయించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
Death sentence : నిరంతర సహాయక చర్యలు
విదేశాల్లో మరణశిక్షను ఎదుర్కొంటున్న భారతీయులకు సహాయం అందించేందుకు భారత దౌత్య కార్యాలయాలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. ఖైదీ భారతీయులకు జైల్లో కలిసేందుకు అధికారులు వెళ్తారు. వారి కేసును స్థానిక కోర్టులు, జైళ్లలో, ప్రభుత్వ దర్యాప్తు సంస్థల దగ్గర అనుసరించడానికి సహాయం చేస్తారు. చట్టపరమైన సహాయం పొందేలా చర్యలు తీసుకుంటారు. అవసరమైతే అప్పీల్ దాఖలు చేయడం, క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేయడం వంటి న్యాయపరమైన మార్గాలను సూచిస్తారు.
విడుదలకు ముమ్మర ప్రయత్నాలు
భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు విదేశీ ప్రభుత్వాలతో సంప్రదింపులు చేస్తూ, భారతీయ ఖైదీలకు క్షమాభిక్ష లేదా శిక్ష తగ్గింపునకు మార్గాలను అన్వేషిస్తోంది. అంతే కాకుండా, కొన్ని దేశాలతో ఖైదీ మార్పిడి ఒప్పందాలు (Prisoner Transfer Treaties) కుదుర్చుకుంది. విదేశాల్లో శిక్ష అనుభవిస్తున్న భారతీయులను స్వదేశానికి పంపించి, వారి మిగిలిన శిక్షను స్వదేశంలో అనుభవించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే భారతీయ ఖైదీలకు, ప్రత్యేకించి ఆపదలో ఉన్న వారికి సహాయం అందించేందుకు Indian Community Welfare Fund (ICWF) అనే ప్రత్యేక నిధిని కేంద్రం ఏర్పాటు చేసింది. తద్వారా విదేశాల్లో ఉన్న ఖైదీలు న్యాయ సహాయం పొందే అవకాశం ఉంటుంది. తిరిగి స్వదేశానికి వెళ్లేందుకు అవసరమైన ప్రయాణ ఖర్చులను ప్రభుత్వం భరించే అవకాశం కూడా ఉంటుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    