Delhi School Bomb Threats : దేశ రాజధాని ఢిల్లీలోని పలు స్కూళ్లకు వరుసగా బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. నగరంలోని మదర్ మేరీస్ స్కూల్, బ్రిటిష్ స్కూల్, సాల్వాన్ పబ్లిక్ స్కూల్, కేంబ్రిడ్జ్ స్కూల్‌తో సహా పలు పాఠశాలలకు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చినట్లు ఢిల్లీ పోలీసులు సోమవారం తెలిపారు. ఆర్‌కే పురంలో ఒకటి, పశ్చిమ విహార్‌లోని రెండు పాఠశాలలకు హెచ్చరికలు అందాయని పోలీసులు ప్రాథమికంగా తెలిపారు.
బాంబు బెదిరింపు సమాచారం అందుకున్న తర్వాత, రెండు పాఠశాలల నిర్వాహకులు పిల్లలను వారి ఇళ్లకు తిరిగి పంపించేశారు. డీపీఎస్ ఆర్కే పురం నుంచి ఉదయం 7.06 గంటలకు, జీడీ గోయెంకా పశ్చిమ్ విహార్ నుంచి ఉదయం 6.15 గంటలకు బాంబు బెదిరింపులు వచ్చాయని డీఎఫ్‌ఎస్ అధికారి తెలిపారు. అగ్నిమాపక అధికారులు, డాగ్ స్క్వాడ్, బాంబు డిటెక్షన్ బృందాలు, స్థానిక పోలీసులు హుటాహుటిన పాఠశాలలకు చేరుకుని సోదాలు నిర్వహించారు. అయితే ప్రాథమిక విచారణలో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని ఓ అధికారి తెలిపారు.
డిసెంబరు 8న రాత్రి 11:38 గంటలకు ఇమెయిల్ వచ్చింది. బాంబులు పేలితే భారీ నష్టం వాటిల్లుతుందని పేర్కొంది. ఈమెయిల్ పంపిన వ్యక్తి బాంబులు పేల్చనందుకు బదులుగా $30 వేలు డిమాండ్ చేశాడు. ఢిల్లీ పోలీసులు ఐపీ అడ్రస్, ఈమెయిల్ పంపిన వారిపై దర్యాప్తు చేస్తున్నారు.