Green Hydrogen | తెలంగాణలో పర్యావరణాన్ని కాపాడుతూ సాంకేతికతను ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Bhatti vikramarka ) తెలిపారు. 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ (Green Energy)ని అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశామని అన్నారు. 2030 నాటికి ఇది సాధించి తీరుతామని అన్నారు. ఐఐటీ హైదరాబాద్‌లో ఈ రోజు జరిగిన ఆస్ట్రేలియా-ఇండియా క్రిటికల్ మినరల్స్ రీసెర్చ్ హబ్ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు.
భవిష్యత్తు ఇంధనంగా Green Hydrogen
భవిష్యత్తు ఇంధనంగా గ్రీన్ హైడ్రోజన్ మారబోతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణను గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా మారుస్తామని అన్నారు. ఇన్నోవేషన్, పర్యావరణ అనుకూలతను పెంపొందించడంలో తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఇందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, దాని అనుగుణంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. 2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని సాధించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని వెల్లడించారు.
క్రిటికల్ మినరల్స్ వెలికి తీసే దిశగా..
మోనాష్ విశ్వవిద్యాలయం (Monash University) సహకారంతో క్రిటికల్ మినరల్స్ రిసెర్చ్ హబ్‌ను ఏర్పాటు చేస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. తెలంగాణకు మాత్రమే కాకుండా దేశ విదేశాలకు ఇదెంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అన్నారు. రాష్ట్రానికి స్వచ్ఛమైన పచ్చని ఇంధనాన్ని రూపకల్పన చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని భట్టి తెలిపారు. తెలంగాణలో క్రిటికల్ మినరల్స్‌ను సమర్థంగా వెలికితీయడానికి అవసరమైన పద్ధతులను రూపొందించాల్సిన అవసరం ఉందని భట్టి విక్రమార్క అన్నారు. సోలార్ పవర్ ప్యానెల్స్, విండ్ టర్బైన్లు, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎనర్జీ స్టోరేజ్ బ్యాటరీలు తదితర పరికరాలను నిర్మించడంలో ఈ మినరల్స్ ప్రాముఖ్యతగలవని చెప్పారు.
ఐఐటీ హైదరాబాద్ పాత్ర భేష్
పరిశోధన, ఆవిష్కరణల్లో ఐఐటీ హైదరాబాద్ సాధిస్తున్న విజయాలు ప్రశంసనీయమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కొనియాడారు. 11,500 పైగా పరిశోధనా పత్రాలు, 320 పేటెంట్లు, వివిధ స్టార్టప్‌ల ద్వారా రూ. 1,500 కోట్ల ఆదాయం సాధించడం అభినందనీయమన్నారు. ఐఐటీలు విద్యా సంస్థలు మాత్రమే కాకుండా దేశ నిర్మాణానికి కీలక వేదికలుగా మారాయని హర్షం వ్యక్తం చేశారు.
నెహ్రూను స్మరించుకుంటూ..
దివంగత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఐఐటీలను ఆధునిక భారత దేవాలయాలుగా అభివర్ణించిన నేపథ్యాన్ని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. సాంకేతిక అభివృద్ధి ద్వారా అసవసరమైన వనరులను అందించి పేదరికం, అసమానతలను రూపుమాపడంలో ఐఐటీలు కృషి చేస్తున్నాయని భట్టి కొనియాడారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








