Domestic air passenger traffic : ఇండియాలో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2025 జనవరిలో మొత్తం 150.3 లక్షల మంది విమానాల్లో ప్రయాణించారని లెక్కలు చెబుతున్నాయి. ఇది 2024 డిసెంబర్‌తో పోల్చితే 0.7 శాతం పెరుగుదలను సూచిస్తోంది. అంతేకాకుండా 2024 జనవరితో పోల్చితే 14.5 శాతం అధికంగా ఉంది. మొత్తం దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 2024 ఏప్రిల్ నుంచి 2025 జనవరి వరకు 1,372.1 లక్షలకు చేరుకుంది. ఇది ఏడాది ప్రాతిపదికన 7.5 శాతం పెరుగుదలను సూచిస్తోంది. అంతేకాకుండా కొవిడ్ ఫస్ట్ కాలంతో (FY20) పోల్చితే 13 శాతం ఎక్కువగా ఉంది. దేశీయ విమానయాన రంగం తిరిగి వేగంగా కోలుకుంటున్నట్లు ఈ గణాంకాలు చెబుతున్నాయి.
అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్యలోనూ వృద్ధి
దేశీయ విమానయాన రంగంతో పాటు అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగింది. FY25 మొదటి తొమ్మది నెలల్లో భారతీయ ఎయిర్‌లైన్స్ ద్వారా ప్రయాణించిన అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 248.9 లక్షలకు చేరింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 14.5 శాతం పెరుగుదలగా ఉంది. కొవిడ్ కాలం (FY20) పోలిస్తే 41.7 శాతం ఎక్కువగా ఉంది. అంతర్జాతీయ విమాన ప్రయాణాల సంఖ్య కూడా కరోనా దెబ్బ నుంచి పూర్తిగా కోలుకుని, మెరుగైన స్థాయికి చేరుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
Domestic air passenger traffic : ఎయిర్‌లైన్స్ సామర్థ్య విస్తరణ.
ఎయిర్‌లైన్స్ తమ సామర్థ్యాన్ని 2025 జనవరి నెలలో 10.8 శాతం పెంచాయి. అయితే.. 2024 డిసెంబరుతో పోలిస్తే ఇది 1.2 శాతం తక్కువగా ఉంది. ప్రయాణికుల రద్దీ కూడా గణనీయంగా పెరిగింది. 2025 జనవరిలో దేశీయ విమానయాన రంగం సగటున 92.1% ప్లేన్ లోడింగ్ రేటును (Passenger Load Factor – PLF) సాధించింది. 2024 జనవరిలో ఇది 89.2% గా ఉంది. 2020 జనవరిలో (కొవిడ్ కాలం) ఇది 85.0% మాత్రమే ఉంది. విమానయాన రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతోందని ఈ గణాంకాలే నిదర్శనం.
ఇంధన ధరల మార్పులు.. వాటి ప్రభావం
విమానయాన రంగంలో ఇంధన ఖర్చు (Aviation Turbine Fuel – ATF) కీలక భూమిక పోషిస్తోంది. 2024 ఏప్రిల్ – జూలై మధ్య కాలంలో ATF ధరలు 5.3 శాతం పెరిగాయి. అయితే, ఆగస్టు 2024 నుంచి ఫిబ్రవరి 2025 మధ్యకాలంలో ATF ధరలు 14.7 శాతం తగ్గాయి. సమగ్రంగా చూస్తే 2024 ఏప్రిల్ నుంచి 2025 ఫిబ్రవరి మధ్య కాలం, గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ATF ధరలు 8.1 శాతం తక్కువగా నమోదయ్యాయి. ఇంధన ధరలు తగ్గడంతో విమానయాన సంస్థల ఆర్థిక భారం కొంత మేర తగ్గే అవకాశం ఉంది.
భవిష్యత్‌లో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయంటే..
దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య స్థిరంగా పెరుగుతూనే ఉన్న నేపథ్యంలో దీనికి అనుగుణంగా విమానయాన కంపెనీలు తమ సేవలను మరింత విస్తరించుకొనే అవకాశం ఉంది. ATF ధరలు తగ్గడం వల్ల టికెట్ ధరలు స్థిరంగా ఉండొచ్చు. లేదా స్వల్పంగా తగ్గే అవకాశముంది. విమానయాన సంస్థలు కొత్త నగరాలకు విమాన సేవలను విస్తరించే అవకాశం ఉంది. ముఖ్యంగా, చిన్న పట్టణాల నుంచి పెద్ద నగరాలకు కనెక్టివిటీ మెరుగు పడొచ్చు. ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు ఎయిర్‌లైన్స్ కొత్త సదుపాయాలను అందించొచ్చు. అధునాతన టెక్నాలజీ, సౌకర్యవంతమైన ప్రయాణ విధానాలు పెరగొచ్చు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








