Donald Trump’s inauguration : భారతీయ సంస్కృతి అమెరికాలో ప్రతిబింబించింది. ఆ దేశ అధ్యక్షుడిగా డోలాన్డ్ ట్రంప్ (Donald Trump) ప్రమాణ స్వీకారం చేస్తున్న మహోత్సవంలో శివం డోల్ తాషా గ్రూపు ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల మదిని దోచుకుంది. ఇది కేవలం సంగీత ప్రదర్శనే కాకుండా భారతీయ ఆధ్యాత్మికత, సామూహికతను ప్రపంచానికి పరిచయం చేసింది. 30 మంది సభ్యులు కలిగిన ఈ గ్రూప్ తన అద్భుతమైన ప్రదర్శన ద్వారా భారతీయ మూలాలను అమెరికన్ గడ్డమీద కొత్త పుంతలు తొక్కించారు.
క్యాపిటల్ హిల్‌లో చారిత్రక వేడుక
క్యాపిటల్ హిల్ రోటుండా లోపల 1985 తర్వాత తొలిసారి జరిగిన డోనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకార వేడుక చరిత్రలో కొత్త అధ్యయాన్ని లిఖించింది. అమెరికా (America) చట్టసభ భవనం వద్ద స్నోఫాల్ కారణంగా ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. దీంతో మరింత భారీ భద్రతా చర్యలు చేపట్టాల్సి వచ్చింది. .
భారత ప్రతినిధిగా జై శంకర్
ట్రంప్ ప్రమాణస్వీకార వేడుకకు భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ (S. Jaishankar) హాజరయ్యారు. భారత ప్రతినిధిగా ఆయన ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాధినేతల దృష్టిలో భారత్ పట్ల ఉన్న ఆదరణకు ఇది నిదర్శనమని ఈ సందర్భంగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అంబానీ దంపతుల హాజరు
ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి అంబానీ దంపతులు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. అంతర్జాతీయ దిగ్గజాల నడుమ ముకేష్ అంబానీ (Mukesh Ambani), నీతా అంబానీ (Nita Ambani) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అంతర్జాతీయ వేదికలపై భారతీయ ప్రాతినిధ్య ప్రాధాన్యం పెరిగిందనడానికి ఇదే నిదర్శనమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది భారత్, అమెరికా మధ్య సంబంధాలను మరింత బలపరుస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
వీక్షించిన కోట్లాది మంది
ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని అమెరికా ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించారు. ఈ వేడుకకు భారతీయుల ప్రతినిధులు హాజరు కావడం, మన దేశ సంస్కృతికి ప్రతీక అయిన సంగీత ప్రదర్శన అక్కడ నిర్వహించడం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.
భద్రతా వలయంలో వాషింగ్టన్
ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని అత్యంత పటిష్ట భద్రత నడుమ నిర్వహించారు. వాషింగ్టన్ డీసీ మొత్తాన్ని సాంకేతిక భద్రతా వలయంలోకి తీసుకున్నారు. డ్రోన్ల సహాయంతో నిఘా పెడుతూ భద్రత పరంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేశారు.
వంద రోజుల్లో రూపురేఖలు మారుస్తా: Donald Trump
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ట్రంప్ దీనికి ముందు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తనకు గొప్ప విజయాన్ని అందించారని, వారికి అన్ని విధాలుగా అండగా ఉండటమే తన కర్తవ్యమని అన్నారు. అధికారం చేపట్టిన వంద రోజుల్లో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేయడమే కాకుండా అమెరికా ఆర్థిక, భద్రతా రంగాలను కొత్తపుంతలు తొక్కించేందుకు చర్యలు చేపడతానని చెప్పారు.
ఐరన్ డోమ్ మిసైల్ సిస్టం తయారు చేస్తాం
ట్రంప్ తన ప్రసంగంలో అమెరికా సైన్యం కోసం మరింత శక్తిమంతమైన ప్రణాళికలను ప్రకటించారు. ఐరన్ డోమ్ మిసైల్ డిఫెన్స్ సిస్టంను అమెరికాలోనే తయారుచేసి, ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితిని తొలగిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇది కేవలం రక్షణ వ్యవస్థకే పరిమితం కాకుండా దేశీయ ఉత్పత్తులపై జాతీయ ఆత్మనిర్భరతను పెంపొందిస్తుందని ట్రంప్ చెప్పారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..