తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్న ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ ((Bharat Rashtra Samithi (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KT.Rama Rao ) ఈ రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) ఎదుట హాజరయ్యారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. హైదరాబాద్‌లో బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈడీ (Enforcement Directorate) కార్యాలయం వద్ద ఉద్రిక్తత
గచ్చిబౌలిలోని తన నివాసం నుంచి కేటీఆర్ (KTR) ఉదయం 10 గంటలకు బయలుదేరి భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈడీ (Enforcement Directorate) కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈడీ కార్యాలయానికి చేరుకొని కేంద్ర ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
స్వల్ప హింసాత్మక ఘటనలు
ఈడీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో స్వల్పంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పార్టీ ప్రతినిధి మన్నె కృష్ణాంక మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కృష్ణాంకతో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో బత్తినీ కీర్తి లత, పవని గౌడ్ వంటి పలువురు నాయకులు కూడా అరెస్టయ్యారు.
ముఖ్య నేతల గృహనిర్బంధం
బీఆర్ఎస్ ఆందోళనలను అడ్డుకోవడానికి పోలీసులు ఆ పార్టీ ముఖ్య నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ సహా పలువురిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఇది బీఆర్ఎస్ కార్యకర్తలలో ఆగ్రహం రేకెత్తించింది.
ఫార్ములా-ఈ కేసు నేపథ్యం
హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా-ఈ రేస్ (Formula-E race) కు సంబంధించిన వ్యవహారంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపణలతో కేసు నమోదైంది. ఆ సమయంలో ప్రభుత్వ నిధుల వాడకంపై అనేక ప్రశ్నలు లేవనెత్తబడ్డాయి. ఈ వ్యవహారంలో ఈడీ దర్యాప్తు మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే కేటీఆర్ దాఖలు చేసిన ఏసీబీ కేసు రద్దు పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీని తర్వాత ఈడీ కేటీఆర్‌ను జనవరి 7న విచారణకు పిలిచింది. అయితే.. హైకోర్టు నిర్ణయం కోసం మరికొంత సమయం కావాలని కోరుతూ కేటీఆర్ అభ్యర్థించారు. దీనిపై ఈడీ సానుకూలంగా స్పందించి కొంత సమయం ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు (జనవరి 16న) విచారణకు పిలిపించింది.
విచారణకు సహకరిస్తానన్న కేటీఆర్
ఈ కేసుపై కేటీఆర్ స్పందిస్తూ తెలంగాణ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. ఫార్ములా-ఈ రేస్‌ను హైదరాబాద్‌లో నిర్వహించడం ద్వారా ప్రపంచానికి మన నగరాన్ని ప్రదర్శించే అవకాశం దక్కిందని, ఇది అప్పటి ప్రభుత్వ ప్రోత్సాహంతో జరిగిన ఒక అద్భుత నిర్ణయమని అన్నారు. ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..