Engineering Education : తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యకు ఆదరణ తగ్గుతోంది. ముఖ్యంగా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. దీంతో ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లు తగ్గుముఖం పట్టాయి. ఈ విద్యా సంవత్సరానికి ( 2024-25) మేనేజ్‌మెంట్ కోటా కింద 6 వేల సీట్లు ఇంకా ఖాళీగానే ఉన్నాయి.
10 కాలేజీల్లో భర్తీకాని అడ్మిషన్లు
తెలంగాణలో మొత్తం 175 ఇంజినీరింగ్ కాలేజీలు (Engineering Colleges) ఉన్నాయి. వీటిలో 1.08 లక్షల సీట్లు అందుబాటులో ఉండగా 36 వేల సీట్లు మేనేజ్‌మెంట్ కోటా కింద ఉంటాయి. ఇప్పటి వరకు 30 వేల సీట్లు భర్తీ అయినప్పటికీ ఇంకా 6 వేలు సీట్లు ఖాళీగానే ఉన్నాయి. 10 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటా కింద ఒక్క అడ్మిషన్ కూడా భర్తీ కాలేదు. ఈ కాలేజీలు అధికంగా B-కేటగిరీ (మేనేజ్‌మెంట్ కోటా) అడ్మిషన్లపై ఆధారపడటం వల్ల వాటి ఆర్థిక సమస్యలను మరింత తీవ్రతరం చేసింది.
ఒక్కో కాలేజీలో 10-15 సీట్లు మాత్రమే..
ఇంజినీరింగ్ కోర్సు ( Engineering Courses)లపై పదేళ్లుగా డిమాండ్ తగ్గుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రైవేటు కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద కూడా 10-15 అడ్మిషన్లు మాత్రమే భర్తీ అయ్యాయి. దీంతో కాలేజీలను కొనసాగించడం యాజమాన్యాలకు చాలా కష్టంగా మారింది. ఈ సంవత్సరం మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ వంటి ఇంజనీరింగ్ కోర్సుల పట్ల విద్యార్థుల ఆసక్తి మరింత తగ్గింది. కంప్యూటర్ సైన్స్, సంబంధిత కోర్సులకు మాత్రం కాస్త ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోంది.
నిబంధనలు ఉల్లంఘించిన కళాశాలలు
మరోవైపు తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TGCHE) నిబంధనలు ఉల్లంఘించిన తొమ్మిది ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కొన్ని కాలేజీలు అధికారిక నోటిఫికేషన్‌కు ముందే విద్యార్థులను చేర్చుకొని, అధిక ఫీజులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. షోకాజ్ నోటీలకు సమాధానం వచ్చాకే మేనేజ్‌మెంట్ కోటా కింద ఈ కాలేజీల్లో అడ్మిషన్ ప్రక్రియ పూర్తి కానుంది.
Engineering Education : డిమాండ్ తగ్గటానికి ప్రధాన కారణాలు
- ఇంజినీరింగ్ కోర్సులు పట్టుబట్టి ఉండే విద్యార్థుల సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో గణనీయంగా తగ్గడం.
- ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకునేందుకు కంప్యూటర్ రంగంలో అవకాశాలు ఎక్కువగా ఉండటంతో విద్యార్థులకు ఆ కోర్సులపై మక్కువ పెరిగింది. సివిల్, మెకానికల్ కోర్సులపై ఆసక్తి తగ్గింది.
- కోర్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌లకు సంబంధించి ఉద్యోగావకాశాలు పరిమితం కావడం వల్ల విద్యార్థులు ఇతర రంగాల వైపు మొగ్గుచూపుతున్నారు.
- ప్రైవేట్ కాలేజీల ఫీజులు సామాన్య కుటుంబాలకు భారం కావడం కూడా అడ్మిషన్లను తగ్గించే అంశంగా మారింది.
విద్యావంతులు ఏముంటున్నారంటే..
తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్య(Engineering Education System)లో ప్రస్తుత పరిస్థితులు సవాళ్లతో కూడివున్నప్పటికీ సరైన చర్యలు తీసుకుంటే సులభంగానే పరిష్కరించవచ్చని అంటున్నారు విద్యావంతులు. ఆయా కోర్సులలో నాణ్యతను పెంచడం, విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








