EVMs Role in Election Results : మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఈవీఎంలు ప్రభావితం చేశాయని ప్రతిపక్షాలు సందేహాలు వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ పక్షపాత ధోరణిని అవలంబించిందని ఆరోపిస్తున్నాయి. పోలింగ్ అనంతరం ఫలితాలకు ముందు ఈవీఎం (EVM)లను మార్చారని, ఈ చర్య ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసిందని అంటోంది. అయితే… ఈ ఆరోపణల్లో నిజం లేదని తేటతెల్లం చేసింది ఎన్నికల కమిషన్. వీవీప్యాట్ల (VVPAT)లోని స్లిప్పులను, ఈవీఎంలో నమోదైన ఓట్లను పోల్చి చూపించింది. ఈ రెండింటి సంఖ్య సరిసమానంగా ఉండటంతో ఫలితాలను తారుమారు చేయడంలో ఈవీఎంల పాత్ర ఏమీ లేదని మరోసారి నిరూపించుకుంది.
నిజం కాదని నిరూపణ
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఈవీఎం పాత్ర, ఎన్నికల కమిషన్ పారదర్శకతా లోపంపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఎన్నికల అదనపు ప్రధాన అధికారి కిరణ్ కులకర్ణి స్పందించారు. ఈవీఎంలలో ఎలాంటి ఫిజికల్ హ్యాకింగ్ గానీ, తారుమారు గానీ, డిజిటల్ మార్పులు చేర్పులు గానీ ఉండవని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరిస్తోందని పీటీఐ (PTI)కి ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన వివరించారు. విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని కొట్టిపారేసారు. EVMలు పూర్తిగా స్టాండప్‌లోన్ పరికరాలుగా పనిచేస్తాయని అన్నారు. అవి ఏ ఇతర నెట్‌వర్క్‌కు గానీ, వ్యవస్థకు గానీ అనుసంధానం కావని, దీంతో హ్యాకింగ్‌కు అవకాశమే లేదని వివరించారు.
బ్యాటరీ ఫుల్ చార్జ్‌పై విపక్షాల అనుమానం
ఎన్నిల ఫలితాల సమయంలో కొన్ని ఈవీఎంలలో 99 శాతం బ్యాటరీ చార్జ్ చూపడంపై కూడా ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. దీనిపై కూడా కులకర్ణి క్లారిటీ ఇచ్చారు. ఈవీఎంలు (EVM) ప్రత్యేకంగా రూపొందించబడిన పరికరమని, ఇతర ఎలక్ట్రానిక్ సాధనాలకు భిన్నమని అన్నారు. ఎన్నికల నిర్వహణ సమయంలోనే వాటి బ్యాటరీ ఉపయోగపడుతుందని, ఓటు వినియోగ సమయంలో నేరుగా రికార్డింగ్‌కు సంబంధించిన పనితీరును దెబ్బతీయవని స్పష్టం చేశారు.
VVPAT పాత్ర కీలకం
EVMలపై ప్రజల నమ్మకాన్ని పెంచడంలో వీవీప్యాట్లు కీలకపాత్ర పోషిస్తాయి. ఓటర్లు చేసిన ఓటు ఏ అభ్యర్థికి వెళ్లిందో నిర్ధారించుకొనేందుకు ఇవి ఉపయోగపడతాయి. మహారాష్ట్ర ఎన్నికల అనంతరం 1440 వీవీప్యాట్ల స్లిప్పులను ఈవీఎంల డేటాతో పోల్చినప్పుడు 100 శాతం సరితూగాయి. ఇది ఈవీఎంల విశ్వసనీయతకు నిదర్శనమని ఎన్నికల కమిషన్ తెలిపింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని తేటతెల్లమైందని పేర్కొంది. EVM లు, VVPATలు భారతదేశ ఎన్నికల విధానంలో బలమైన ఆధారాలుగా నిలుస్తున్నాయని అంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..