- కారెక్కేందుకు సిద్దమైన మాజీ ఎమ్మెల్యే?
- రాష్ట్రంలో జోరుగా ప్రచారం.. ప్రచారానికి ఆజ్యం పోస్తున్న పర్యటనలు ..
Ex MLA Ghar Wapsi in Telangana | కొన్నాళ్లు ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా ఉంటున్న ఓ మాజీ ఎమ్మెల్యే సడన్ గా రూటు మార్చనున్నారా? ఆయన త్వరలో కారెక్కేందుకు సిద్ధమయ్యారా? కాషాయ పార్టీని వీడి గులాబీ దళంలో చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారా? అందుకే నియోజకవర్గంలో పర్యటనల స్పీడ్ పెంచారా? అంటే ఇప్పుడు ఆ నియోజవకర్గంలో ఎవరిని అడిగినా అవుననే సమాధానం వస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ముందు బిఆర్ఎస్ నుంచి కమలం పార్టీ(BJP)లో చేరిన సదరు మాజీ ఎమ్మెల్యే తిరిగి సొంతగూటికి చేరబోతున్నట్టు పుకార్లు వినిపిస్తున్నాయి. ఆ మాజీ ఎమ్మెల్యే” ఘర్ వాపసీ” (Ghar Wapsi) వార్తల్లో నిజమెంత, కాషాయ పార్టీని ఎందుకు వీడాలనుకుంటున్నారు. సదరు మాజీ ఎమ్మెల్యే పార్టీ మారుతున్నారంటు జరుగుతున్న ప్రచారంపై ప్రత్యేక కథనం..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వర్ధన్నపేట నియోజకవర్గం (Wardhannapet Constituency) వరుసగా రెండు పర్యాయాలు గులాబీ పార్టీ నుంచి ఎమ్మెల్యే గా గెలిచిన అరూరి రమేష్ (Aroori Ramesh) రాష్ట్రంలోనే రెండవ భారీ అత్యధిక మెజార్టీ తో గెలిచి రికార్డు సృష్టించారు. అయితే 2023 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. పార్టీలో ఉన్న సీనియర్ నేతలే తన ఓటమికి కారణమని భావించిన ఆయన బిఆర్ఎస్ ను వీడి భాజాపా గూటికి చేరారు. అనంతరం పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరుపున వరంగల్ ఎంపీగా పోటీ చేసినప్పటికి కాంగ్రెస్ అభ్యర్ధి చేతిలో ఓడిపోయారు. ఎన్నికల అనంతరం కొన్నిరోజులపాటు మౌనంగా ఉన్న ఆయన తన నియోజకవర్గంలో దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. నిత్యం ఏదో శుభకార్యాలు, పరామర్శల పేరుతో ప్రజల్లో ఉంటున్నారట.
ప్రచారానికి ఆజ్యం పోస్తున్న పర్యటనలు..
ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలోని ఎస్సి రిజర్వ్డ్ నియోజకవర్గానికి 2014 నుండి 2023 వరకు దాదాపు పదేళ్ల పాటు ఎమ్మెల్యే గా ఉన్న అరూరి రమేష్ 2023 జరిగిన శాసనసభ ఎన్నికల్లో కారు గుర్తుపై పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అనంతరం బీజేపీలో చేరి వరంగల్ ఎంపీగా పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో నియోజకవర్గంలో ఆయన పర్యటనలు చర్చనీయాంశం అవుతున్నాయి. గులాబీ పార్టీ(BRS Party)లో తన అనుచరులుగా ముద్రపడిన కొందరి నాయకుల ఇళ్లల్లో శుభకార్యాలకు, శుభకార్యాలకు హాజరుకావడం, గులాబీ కార్యకర్తలతో స్నేహపూర్వకంగా ఉండడంతో అరూరి సొంతగూటికి వెళ్లేందుకు యత్నిస్తున్నట్లు ఓరుగల్లులో ప్రచారం సాగుతోంది. పైగా ఆయన ఎక్కడ ఏ కార్యక్రమంలో పాల్గొన్నా తన సోషల్ మీడియాలో బీజేపీ నాయకుడు అని కాకుండా కేవలం మాజీ ఎమ్మెల్యే అని ఉండడం విశేషం.
Ghar Wapsi : కారెక్కుతారా..? బిజెపిలోనే కొనసాగుతారా..?
వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత బీజేపీ నేత ఆరూరి రమేష్ బీజేపీ పార్టీ ని విడిచి సొంతగూటికి చేరుతారంటూ ఓరుగల్లులో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.వాస్తవానికి ఆరూరి రమేష్ గులాబీ అధిష్టానానికి విధేయులుగా ఉంటూ పార్టీని బలోపేతం చేసేందుకు తన సాయశక్తులా కృషి చేశాడని చెప్పవచ్చు. రమేష్ ఎస్సి కావడం అందులోనూ రెండుసార్లు ఎమ్మెల్యే గా గెలవడంతో మూడోసారి కనుక ప్రభుత్వం ఏర్పడి, ఈయన గెలిస్తే మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నట్లు భావించిన సీనియర్లు కొంతమంది తనను కావాలనే ఓడించారని ,పార్టీలో ఉంటే ఎప్పటికైనా ఇబ్బందులు తప్పవనే ఉద్దేశంతోనే పార్టీ మారినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.
ఆరూరి తప్పనిసరి పరిస్థితుల్లోనే బీజేపీలో చేరినట్లు, ప్రస్తుతం బీజేపీలో కొనసాగడంవల్ల నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో ఆదరణ ఉండదని, బిజేపి లోనే కొనసాగితే మనుగడ కష్టమని ఆరూరి సన్నిహితులు, అభిమానులు లోలోపల మదనపడుతున్నారట. రాష్ట్రంలో ప్రచారం జరుగుతున్నట్లు ఆరూరి తిరిగి (Ghar Wapsi ) కారెక్కుతారా..? లేదంటే బిజెపిలోనే కొనసాగుతారా..?అనేది మరికొద్దిరోజుల్లోనే తేలిపోనుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..