ముంబై (Mumbai attack) దాడుల ప్రధాన సూత్రధారి తహవుర్ రానా (Tahawwur Rana)ను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రానాను భారత్‌కు అప్పగించాలని అక్కడి సుప్రీంకోర్టు 2025 జనవరి 1న ఆదేశాలు జారీ చేయగా అదే న్యాయస్థానం (United States’ Supreme Court )లో అతడు పిటిషన్ దాఖలు చేశాడు. తనను భారత్‌కు అప్పగించొద్దని విజ్ఞప్తి చేశాడు. అతడి ఈ అభ్యర్థనను అమెరికా సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో రానాను త్వరలో భారత్ (India)కు తీసుకురావడం ఖాయమైంది.
Mumbai attack Tragedy : ముంబై దాడులు.. తీరని విషాదం
ముంబై నగరంలో 2008 నవంబర్ 26న జరిగిన ఉగ్రదాడి భారతదేశ చరిత్రలో అత్యంత భయానక ఘటనగా నిలిచింది. పాకిస్థాన్ (Pakistan)కు చెందిన ఉగ్రవాదులు 166 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్నారు. దీంతో భారతదేశం మాత్రమే కాదు.. ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. పక్కాప్రణాళికతో ఈ దాడులు జరిగాయి. దీనికి ముందు ముంబైలోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించి పకడ్బందీ సాధనలు చేశారు. ఈ వ్యూహాల వెనుక తహవుర్ రానా కీలక పాత్ర పోషించినట్టు అప్పట్లో నిఘా వర్గాలు తేల్చాయి.
మాస్టర్‌మైండ్ తహవుర్ రానా
తహవుర్ రానా పాకిస్థాన్ సైన్యంలో వైద్యుడిగా పని చేశాడు. భారత వ్యతిరేక భావజాలం కలిగి ఉండటం అతడిని ఉగ్రవాద మార్గంలోకి నడిపించింది. 1960 జనవరి 12న పాకిస్థాన్‌లో జన్మించిన రానా తన విద్యార్హతలను ఉపయోగించుకుని ముందుగా పాకిస్థాన్ సైన్యంలో వైద్యుడిగా పనిచేశాడు. అనంతరం కెనడాకు వెళ్లి పౌరసత్వం పొంది ఇమ్మిగ్రేషన్ వ్యాపారం ప్రారంభించాడు. అమెరికా, టొరంటో వంటి నగరాల్లో దాన్ని విస్తరించాడు.
హెడ్లీ, రానా బంధం
తహవుర్ రానా, డేవిడ్ హెడ్లీ (దావూద్ గిలానీ) జిగ్రీ దోస్తులు. వీరి బంధం చాలా కాలం నాటిది. హసన్ అబ్దుల్ మిలిటరీ కాలేజీ నుంచి ప్రారంభమైన ఈ స్నేహం ముంబై దాడుల రూపంలో ప్రపంచానికి ప్రమాదకరంగా మారింది. భారతదేశానికి వెళ్లిన హెడ్లీ కీలక ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి, రానాతో వివరాలు పంచుకున్నాడు. ఈ సమాచారంతోనే లష్కరే తోయిబా ఆధ్వర్యంలో దాడులకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
ముంబై దాడుల వెనుక వ్యూహం
హెడ్లీ, రానా ప్రణాళిక ప్రకారం ముంబై నగరంలోని పలు ప్రదేశాలను ఉగ్రదాడులకు (Mumbai attack) లక్ష్యంగా ఎంచుకున్నారు. ఇందులో హెడ్లీకి అవసరమైన సహకారాన్ని తహవుర్ రానా అందించాడు. పాకిస్థాన్‌లో ఉన్న మేజర్ ఇక్బాల్‌తో తహవుర్ రానా టచ్‌లో ఉండి, భారతదేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని పంచుకున్నాడు. హెడ్లీతో కలిసి, ముంబై దాడులకు అవసరమైన సమాచారాన్ని అందించడంలో రానా పాత్ర కీలకమని నిఘా వర్గాలు వెల్లడించాయి. ముంబై దాడుల ప్రధాన లక్ష్యాల్లో శివసేన భవన్, మాతోశ్రీ, సిద్ధివినాయక టెంపుల్, నారిమన్ హౌస్, తాజ్ హోటల్ వంటి ప్రదేశాలు ఉండడం గమనార్హం.
అరెస్టు నుంచి అప్పగింత వరకు..
తహవుర్ రానా 2011లో అమెరికాలో అరెస్టయ్యాడు. 2013లో డెన్మార్క్ దాడికి సహరించినందుకు 14 సంవత్సరాల జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. అయితే.. ముంబై దాడుల కేసులో ఇప్పటి వరకు రానాను నేరస్థుడిగా నిర్ధారించలేదు. రానాను భారత్‌కు అప్పగించాలనే భారత ప్రభుత్వ విజ్ఞప్తికి అమెరికా సానుకూలంగా స్పందించింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..