farmers protest : కేంద్ర వైఖరికి చేపట్టిన రైతుల ఆందోళన అనేక మలుపులు తిరుగుతోంది. పంటల మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతోపాటు పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రైతులు నాలుగేళ్లుగా ఆందోళనబాట పట్టిన విషయం విదితమే. పంజాబ్, హర్యానా, యూపీ సహా పలు రాష్ట్రాలకు చెందిన రైతులు సమ్యూక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాగా ఏర్పడి నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 13 నుంచి పంజాబ్-హర్యానా, శంబూ-ఖనౌరి సరిహద్దులో మకాం వేశారు. ఇదే క్రమంలో నిరసనల్లో భాగంగా రైతులు చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టారు. వారి ఢిల్లీ మార్చ్‌ను భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో ఉద్రక్తత నెలకొంది. పార్లమెంట్ ఎదుట నిరసనకు బయల్దేరిన యూపీకి చెందిన రైతులను నొయిడా సరిహద్దుల్లో అడ్డుకోవడం, దీంతో అన్నదాతలు ఆందోనకు దిగడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
పోలీసుల ఆంక్షల మధ్య రైతుల ఆందోళన
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సుదీర్ఘ పోరాటం చేస్తున్న రైతులు కాస్త విరామం తర్వాత మరోసారి ఆందోళనలకు ఉపక్రమించారు. ఢిల్లీ సరిహద్దులో నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టారు. శంభు సరిహద్దులోని నిరసన ప్రదేశం నుంచి 101 మందితో ఉన్న రైతుల బృందం శుక్రవారం (6-12-2024) ఢిల్లీకి మార్చ్ చేస్తుందని రైతు నేత స్వరణ్ సింగ్ పంధేర్ ప్రకటించారు. ఈ క్రమంలోనే సోమవారం (9-12-2024) ఉత్తరప్రదేశ్‌కు చెందిన రైతులు పార్లమెంటు ముట్టడికి ప్రయత్నించగా ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత మరోసారి ర్యాలీగా ఢిల్లీలోకి ప్రవేశించేందుకు రైతులు సిద్ధం కావడంతో పోలీసులు ఆంక్షలు విధించారు. హర్యానాలోని అంబా సరిహద్దులో 144 సెక్షన్ విధించి ర్యాలీలు, ఆందోళనలను నిషేధించారు.
తీవ్ర ఉద్రిక్తత
రైతులను అడ్డుకోవడానికి పోలీసు బలగాలు సరిహద్దుల్లో భారీగా మోహరించాయి. పంజాబ్‌లోని మన్సా వద్ద బఠిండా వైపు వస్తున్న 300 మంది రైతులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, రైతుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ముగ్గురు పోలీసు అధికారులకు తీవ్రగాయాలయ్యాయి. అలాగే సరిహద్దులోని హర్యానా వైపు భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. అక్కడా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి.
రైతులపై బాష్ప వాయువు
రైతులను అడ్డుకునేందుకు పంజాబ్, హర్యానా సరిహద్దులో పోలీసులు భారీగా బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేసి రైతులను అడ్డుకున్నారు. వాటిని తొలగించేందుకు రైతులు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు చెదరగొట్టారు. ముందస్తు అనుమతి లేకుండా, గుర్తింపుకార్డులు చూపించకుండా ముందుకెళ్లేందుకు వీళ్లేదని చెప్పడంతో రైతులు వెనక్కి తగ్గారు. మరికాసేపటికి మళ్లీ రైతులు నిరసనకు దిగారు. రోడ్డుపై అడ్డంగా ఉన్న బారికేడ్లు, ముళ్ల కంచెలను తొలగించేందుకు ప్రయత్నించగా ఉద్రిక్తత ఏర్పడింది. రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ను ప్రయోగించారు. దీంతో రైతులు అక్కడి నుంచి వెనుదిరిగారు.
రైతుల ఆందోళనపై సుప్రీం కీలక వ్యాఖ్య
రైతుల ఆందోళనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శాంతియుతంగా నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కు అయినప్పటికీ రహదారులను స్తంభింపజేయడం, ప్రజలకు ఇబ్బందులు కలగించడం సరికాదని పేర్కొంది. రహదారుల మూసివేతను ఎత్తివేసి ర్యాలీలకు మార్గాన్ని సుగమం చేయాలని కేంద్రం, ఇతర అధికారులను ఆదేశించాలని దాఖలైన పిటీషన్‌ను సుప్రీం తిరస్కరించింది. ఈ వ్యవహారం ఇప్పటికే కోర్టులో పరిష్కార దశలో ఉందని, ఒకే విషయంలో పదే పదే పిటీషన్లను పరిశీలించలేమని జస్టిస్ సూర్యకాంత్, మన్మోహన్ పేర్కొన్నారు.
కొందరు ప్రచారం ప్రయోజనాల కోసం, మరికొందరు ప్రజల దృష్టి ఆకర్షించడానికి పిటీషన్లు దాఖలు చేస్తున్నారని, ఒకే విషయంలో పునరావృత అభ్యర్థనలను పరిశీలించలేమని తేల్చి చెప్పారు. పంజాబ్‌కు చెందిన సామాజిక కార్యకర్త రైతుల తరఫున పిటీషన్ దాఖలు చేయగా న్యాయమూర్తులు ఈ మేరకు స్పందించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా ఎక్స్(ట్విట్టర్) లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..