Fengal Cyclone Alert | నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది. దీంతో మరో సైక్లోనిక్ ఫెంగల్ తుఫాను దేశాన్ని తాకబోతోంది. ఇది ఉత్తర-వాయవ్య దిశగా వస్తూ.. తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు కదులుతోందని తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో కోస్తా రాష్ట్రాల్లో ఈ రోజు ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని ప్రకటించింది. ఈదురు గాలులతో కూడా అతి భారీ వర్షాల పడతాయని వెల్లడించింది. తుపాను నేపథ్యంలో ఈరోజు తమిళనాడులో పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని డిఎంకే ప్రభుత్వం ఆదేశించింది. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దించింది. మరోవైపు భారీ వర్షాల కారణంగా చెన్నై ప్రాంతీయ మెట్రోలాజికల్ సెంటర్ (RMC) హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో పొగమంచుతో పాటు చలి కూడా పెరగవచ్చని తెలిపింది.
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు!
ఫెంగల్ తుపాను నేపథ్యంలో నవంబర్ 27, 28వ తేదీల్లో తమిళనాడు, పుదుచ్చేరిలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని ఐఎమ్‌డీ హెచ్చరించింది. ఎన్‌డీఆర్‌ఎఫ్‌లోని 4వ బెటాలియన్‌కు చెందిన ఏడు బృందాలు తీరప్రాంతాల్లో మోహరించాయి. కారైకాల్, తంజావూరు, తిరువారూరు, కడలూరు, నాగపట్నం, మైలాడుతురై జిల్లాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్ ముందస్తు చర్యలు చేపట్టింది. అయితే ఆ రాష్ట్రంలో మంగళవారం ఉదయం నుంచే చెన్నైతోపాటు దాని పరిసర జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో రోడ్లు మొత్తం జలమయంగా మారాయి. దీంతో స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం తుపాను ఉత్తర తమిళనాడు తీరం వైపు కదులుతున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.
విద్యాసంస్థలకు సెలవు
ఫెంగల్ తుఫాన్ నేపథ్యంలో చెన్నైలో నవంబర్ 27 నుంచి 29 వరకు చెన్నైలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అలాగే నవంబర్ 27 నుంచి 30 వరకు కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టుతో సహా పలు జిల్లాలలో ఆరెంజ్, ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఇక చెన్నై, నాగపట్నం, మైలదుత్తురై, తిరువారూర్‌తో సహా 9 జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్‌లోని పలు ప్రాంతాలలో ఈ రోజు ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయి. కోస్తా తమిళనాడులో నవంబర్ 28న కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉంది.