OU students protest : ఉస్మానియా విశ్వవిద్యాలయం (Osmania University) గోదావరి హాస్టల్ భోజనంలో బ్లేడ్ ఉండటం (found a blade in meals) తీవ్ర కలకలం రేపింది. దీనిపై విద్యార్థులు రోడ్డెక్కారు. అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. ఇలాంటి సంఘటనలు రోజురోజుకూ చోటుచేసుకుంటున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
OU students protest : అధికారుల తీరుపై మండిపాటు
గతంలో కూడా భోజనంలో ఇలాగే పురుగులు, బ్లేడ్లు కనిపించాయని, అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు (students) విమర్శించారు. ఇన్ని సంఘటనలు చోటుచేసుకుంటున్నా స్పందించకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఈ నిర్లక్ష్యానికి వైస్ చాన్సలర్ (Vice-Chancellor), చీఫ్ వార్డెన్ (Chief Warden), ఇతర అధికారులు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
కనీసం తిండి కూడా సరిగా పెట్టరా?
ఇంతకుముందు కూడా భోజనంలో పురుగులు, మురికి వస్తువులు లభించినా విశ్వవిద్యాలయ అధికారులు సరైన చర్యలు తీసుకోలేదని విద్యార్థులు మండిపడ్డారు. “మేము ఆరోగ్యకరమైన ఆహారం తినాలని మాత్రమే కోరుకుంటున్నాం. ఇది మా హక్కు. కానీ విశ్వవిద్యాలయ అధికారులు ఎప్పుడూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు” అని ఒక విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక పెద్ద విశ్వవిద్యాలయంలో ఇలాంటి సంఘటనలు జరుగుతుండటం దారుణమని విద్యార్థులు విమర్శించారు. తమ భవిష్యత్తును నిర్మించేందుకు తాము ఇక్కడకు వచ్చామని, కానీ కనీసం మంచి తిండి (food) కూడా దొరకని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
వివాదాలు కొత్తేమీ కాదు
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హాస్టల్ భోజనం నాణ్యతపై అనేకసార్లు వివాదాలు ఏర్పడ్డాయి. గతంలో లేడీస్ హాస్టల్ (Ladies Hostel Complex)లో పురుగులు, ఇనుప ముక్కలు, ప్లాస్టిక్ పీసులు వంటివి భోజనంలో లభించాయని విద్యార్థులు అంటున్నారు. భోజనం తినడం వల్ల సుమారు 10 మంది కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరారని తెలిపారు. అయినప్పటికీ అధికారులు స్పందించపోవడంతో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని అంటున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








