సీఐ విశ్వేశ్వర్‌తో ‘ఫటాఫట్’ ఇంటర్వ్యూ!
రాజకీయ జోక్యాలు, పైస్థాయి ఒత్తిడులు.. ఇవేవీ ఆయన కర్తవ్య నిర్వహణ ముందు నిలవలేవు. “చట్టం ముందు అందరూ సమానమే” అనే సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ, వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలో ప్రజల మన్ననలు పొందుతున్నారు సి.ఐ. డి. విశ్వేశ్వర్. అన్యాయాన్ని ఎదురిస్తూ, బాధితులకు అండగా నిలుస్తున్న ఆయన పనితీరుకు స్థానికులు ‘గబ్బర్ సింగ్’ అని పేరు పెట్టారు.
విశ్వేశ్వర్ – ధైర్యం, నీతి నిజాయితీకి మారుపేరు. గీసుగొండ పోలీస్ స్టేషన్‌లో చట్ట పరిపాలనకు కొత్త అర్థం తెచ్చారు. ఇటీవల తన కఠినమైన, నిష్పాక్షిక వైఖరితో ప్రజల్లో చర్చనీయాంశమయ్యారు. రాజకీయ ఒత్తిడులు, రాజకీయ జోక్యాలు ఎన్ని వచ్చినా “చట్టం ముందు అందరూ సమానమే” అనే సిద్ధాంతంతో ముందుకు సాగుతున్న ఆయన పనితీరు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది.
రాజకీయ ఒత్తిడులకు తలవంచని ఆయన ధైర్యసాహసం స్థానికుల్లో, పేద ప్రజలకు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వచ్చేవాళ్ళలో విశ్వాసాన్ని పెంచింది. ప్రస్తుతం గీసుగొండ పోలీస్ స్టేషన్‌లో కేసుల నమోదులో పారదర్శకత, విచారణలో వేగం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘సర్కార్ లైవ్’ ప్రతినిధి నమిండ్ల ప్రమోద్ ఆయనతో నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూ (Geesugonda CI Vishveshwar Interview) విశేషాలు మీకోసం..
ప్రశ్న: రాజకీయ ఒత్తిడులు వస్తున్నాయనే ప్రచారం ఉంది. మీరు ఎలా తీసుకుంటారు?
సిఐ: పోలీస్ యూనిఫాం వేసుకున్న రోజు నుంచి నాకు వ్యక్తిగత అభిప్రాయాలు, రాజకీయ అనుబంధాలు ఉండవు.
నా ముందు ఫిర్యాదు వస్తే అది కేవలం ఒక కేసు దాన్ని నిర్ధారించేవి సాక్ష్యాధారాలే, చట్టం ప్రకారమే నా నిర్ణయం ఒత్తిడి ఎంత వచ్చినా, ఫైల్‌లో సేకరించిన ఆధారాలే మాట్లాడాలి.
ప్రశ్న:రౌడీయిజం, గంజాయి నిర్మూలన పై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
సిఐ: రౌడీయిజం కు నా పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానం లేదు ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే దానికి తగ్గట్టుగా కౌన్సిలింగ్ తో పాటు చట్టపరమైన చర్యలు గట్టిగా తీసుకోబడతాయి.
ప్రశ్న: పోలీసు ఉద్యోగంలో కఠినమైన సవాళ్లు ఎదురైనప్పుడు ఎలా స్వీకరిస్తారు ?
సిఐ : పోలీసు ఉద్యోగంలో సవాళ్లు సర్వసాధారణం కానీ మనం నిజంగా ప్రజలకు మంచి చేస్తాం నిజాయితీగా వ్యవహరిస్తాం అన్న భావన ప్రజల్లో ఉంటే ప్రజలు తప్పకుండా సహకరిస్తారు.కఠినమైన సమయాల్లో ప్రజలు తప్పకుండా మనల్ని ఆదరిస్తారు అర్థం చేసుకుంటారు.
ప్రశ్న: ప్రభావశీలులపై కేసులు నమోదు చేయడంలో భయం అనిపించదా?
సిఐ: అది నా బాధ్యత, భయం తో ఉద్యోగం చేయడం కష్టం మనం తప్పు చేయనంతవరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు చట్టం ముందు అందరూ సమానమే. తప్పు చేస్తే ఎంతటివారైనా విచారణకు హాజరుకావాల్సిందే. బాధ్యతతో వ్యవహరిస్తే చట్టమే మనకు రక్షణ.
ప్రశ్న: ఒత్తిడులు వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయా?
సిఐ: ఒత్తిడులు వస్తాయి, విమర్శలు వస్తాయి. కానీ అవన్నీ తాత్కాలికం. మనం చేసిన పని నిజాయితీగా ఉంటే చివరికి ప్రజలే మన బలం అవుతారు. కుటుంబం కూడా నా నిర్ణయాల వెనుక నిలబడుతోంది.
ప్రశ్న: మీ విధానంలో ముఖ్యమైన సిద్ధాంతం ఏమిటి?
సిఐ: కేసు నమోదు చేయడంలో ఆలస్యం అలసత్వం ఉండకూడదు. ఆధారాలు పక్కాగా సేకరించాలి. ఎవరికీ అన్యాయం జరగకుండా దర్యాప్తు జరగాలి. “బాధితుడికి న్యాయం, నిర్దోషికి రక్షణ” — ఇదే నా పని విధానం.
ప్రశ్న: కేసు పరిశోధనలో మీరు ఏ విధంగా నేరస్తునితో ప్రవర్తిస్తారు?
సిఐ: నేరం జరిగినప్పుడు నేరస్థుడు ఏ సందర్భంలో ఆ నేరం చేయవలసి వచ్చింది. ఒకవేళ అతను అనుకోకుండా నేరం చేశాడా? లేదా నేరం చేసే ఉద్దేశంతో నేరం చేశాడ అన్నది మనం తెలుసుకొని ఆ నేరాన్ని పరిశోధన చేసినట్లయితే మనకు ఖచ్చితమైన ఫలితాలు తెలుస్తాయి. తప్పు చేసినప్పటికీ నేరస్తులు తమ తప్పును తెలుసుకునే విధంగా పోలీసు అధికారులు నేరస్తులతో కూడా సరైన విధానంలో వాళ్లను ఇంటరాగేట్ చేసినప్పుడు వాళ్లు త్వరితగతిన నిజాలు చెప్పడమే కాకుండా వారి యొక్క నేర ప్రవృత్తిని మానేసే అవకాశం ఉంటుంది.
ముగింపు
గీసుగొండలో ప్రస్తుతం కనిపిస్తున్న క్రమశిక్షణ, పారదర్శకత — ఒక అధికారిలోని నిబద్ధతకు నిదర్శనం. రాజకీయ ఒత్తిడులకు లొంగకుండా, చట్టమే పరమావధి అనే ధృఢ నమ్మకంతో ముందుకు సాగుతున్న సి ఐ విశ్వేశ్వర్ లాంటి అధికారులు ప్రజాస్వామ్యానికి నిజమైన బలం.
“న్యాయం కోసం యూనిఫాం… ఒత్తిడికి కాదు” — ఇదే గీసుగొండ సి ఐ సందేశం.







