Hyderabad | తెలంగాణలోని నేతన్నలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో చేనేత రంగం (Handlooms ) సమగ్రాభివృద్ధికి రూ.238 కోట్లతో చేనేత అభయహస్తం పథకాన్ని చేపడుతున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageshwar Rao) ప్రకటించారు. రైతుల మాదిరిగానే చేనేత కార్మికులకూ రుణమాఫీ అమలుచేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించామని చెప్పారు. ఆర్థిక శాఖ నుంచి ఆమోదం రాగానే చేనేత రుణమాఫీ చేస్తామన్నారు.
చేనేత కార్మికులకు నిరంతర ఉపాధి కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అన్ని ప్రభుత్వశాఖలు తమ అవసరాల కోసం చేనేత వస్త్రాలను టెస్కో ద్వారానే కొనుగోలు చేయాలని మంత్రి సూచించారు. ప్రైవేట్ సంస్థల వద్ద కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గత పదేళ్లు బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేనేత, జౌళి శాఖకు సంబంధించిన బకాయిలను చెల్లించలేదు. దీంతో ఆ భారం మా ప్రభుత్వంపై పడింది. కార్మికుల సంక్షేమం కోసం బతుకమ్మ చీరలు, ఇతర పథకం కింద రూ.428 కోట్లు మంజూరు చేశాం. చేనేత కార్మికులకు చేయూత పథకం కింద మరో రూ.290.09 కోట్ల నిధులు బకాయిలు విడుదల చేశాం. మర మగ్గాల పథకం కింద చేనేతలను ఆదుకునేందుకు రూ.5.45 కోట్లు, 10 శాతం నూలు సబ్సిడీ కింద మరో రూ.37.49 కోట్లు, పావలా వడ్డీ కింద రూ.1.09 కోట్లు చేనేతల సంక్షేమానికి విడుదల చేశాం.’ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
జాతీయ చేనేత సాంకేతిక సంస్థకు త్వరలోనే శాశ్వత క్యాంపస్
చేనేత కార్మికుల ఉపాధి కోసం.. ప్రతి సంవత్సరం 64.70 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు రెండు చొప్పున ఏకరూప చీరల పంపిణీ పథకాన్ని చేపట్టనున్నట్లు మంత్రి తుమ్మల చెప్పారు. జాతీయ చేనేత సాంకేతిక సంస్థకు త్వరలోనే శాశ్వత క్యాంపస్ నిర్మాణాన్ని ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. చేనేతలను ఆదుకుంటామని.. వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తుమ్మల వెల్లడించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా ఎక్స్(ట్విట్టర్) లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








