Google | ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌లో దేశంలోని తొలి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ (GSEC)) ని నెలకొల్పేందుకు గూగుల్ కంపెనీ సన్నాహాలు చేస్తోంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ప్రపంచంలోనే ఐదవది. ఏషియా పసిఫిక్ జోన్ లో టోక్యో తర్వాత ఏర్పాటు చేస్తున్న రెండో అతిపెద్ద సెంటర్ ఇదే కావడం గమనార్హం.. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఒక ప్రత్యేకమైన అంతర్జాతీయ స్థాయి సైబర్ సెక్యూరిటీ హబ్. ఇది హై సెక్యూరిటీ, ఆన్‌లైన్ భద్రతా ఉత్పత్తులను అభివృద్ధి చేయనుంది. అత్యాధునిక పరిశోధన, ఏఐ ఆధారిత భద్రత, సైబర్ సెక్యూరిటీ నిపుణులు, పరిశోధకులకు ఈ సేఫ్టీ సెంటర్ సహకారం అందించే వేదికగా నిలవనుంది.
దేశంలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించి, యువతకు ఉపాధి పెంచడం, సైబర్ సెక్యూరిటీ సామర్థ్యాలు పెంపొందించేందుకు ఈ సెంటర్ పని చేస్తుంది. ఇప్పటికీ భారీ సంఖ్యలో ఉద్యోగులున్న గూగుల్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ ను హైదరాబాద్ లో నిర్మిస్తున్న విషయం తెలిసిందే.. ఈ ఏడాది అక్టోబర్ 3న జరిగిన గూగుల్ ఫర్ ఇండియా 2024 కాన్‌క్లేవ్‌లోనే సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు విషయాన్ని ఆ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అప్పటి నుంచి జీఎస్ఈసీని తమ రాష్ట్రంలోనే నెలకొల్పాలని, గూగుల్ పెట్టుబడులను ఆహ్వానించేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాలు పోటీ పడ్డాయి. కొన్ని నెలల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. అప్పటి నుంచి హైదరాబాద్‌లో ఈ అత్యాధునిక సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపింది. హైదరాబాద్ లో ఈ సేఫ్టీ సెంటర్ ఏర్పాటు చేసేందుకు గూగుల్ ముందుకు రావటం చాలా గర్వంగా ఉందని సీఎం వ్యాఖ్యానించారు.
గూగుల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రాయల్ హాన్సెన్ అధ్వర్యంలోని కంపెనీ ప్రతినిధి బృందం బుధవారం జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హాన్సెన్ మాట్లాడుతూ.. డిజిటల్ స్కిల్ డెవలప్‌మెంట్‌లో తెలంగాణ ముందు ఉందని అన్నారు. ‘ప్రపంచ వ్యాప్తంగా ఐటీ, ఐటీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అభివృద్ధికి హైదరాబాద్ కేంద్రంగా ఉందన్నారు. కాగా, ఇప్పటికే ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఐదు దిగ్గజ టెక్ కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్, అమెజాన్, ఫేస్‌బుక్ ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు సేఫ్టీ సెంటర్ ద్వారా స్థాయిలో సైబర్ సేఫ్టీ సమస్యలను వేగంగా పరిష్కరించే వీలుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.