Schools in Telangana : తెలంగాణ (Telangana) విద్యా వ్యవస్థలో పదేళ్లకాలంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల (Government schools) సంఖ్య పెరిగింది. ప్రైవేటు పాఠశాలల (Private schools) సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ మేరకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ (Ministry of Education) నివేదికలు చెబుతున్నాయి. అయితే.. విద్యార్థుల నమోదు, డ్రాపవుట్ రేట్లు, సౌకర్యాల అభివృద్ధి తదితర అంశాల్లో మాత్రం విద్యా వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని ఈ రిపోర్టు చెబుతోంది.
పాఠశాలల గణాంకాలు (Telangana Schools )
విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం 2014–15లో తెలంగాణలో 29,268 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇవి 2023–24 నాటికి 30,022 కు పెరిగింది. 754 కొత్తగా ప్రభుత్వ పాఠశాలలు ఏర్పడ్డాయి. అదే సమయంలో ప్రైవేట్ పాఠశాలల సంఖ్య 15,069 నుంచి 12,126 కు తగ్గిపోయింది. 2,943 ప్రైవేట్ పాఠశాలలు మూతపడ్డాయి.
సంవత్సరం | ప్రభుత్వ పాఠశాలల సంఖ్య |
2014–15 | 29,268 |
2023–24 | 30,022 |
విశేష మార్పులకు ప్రధాన కారణాలు
- ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం
- విద్యా వ్యవస్థలో నాణ్యత పెంచేలా ప్రభుత్వ పథకాలు తీసుకురావడం
- ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజులు, తల్లిదండ్రుల ఆర్థిక ఇబ్బందులు
- ప్రభుత్వ పాఠశాలలకు ఆధునికీకరణ పనులు, మౌలిక సౌకర్యాల కల్పన
సర్కారు బడుల్లో విద్యార్థుల నమోదు
ప్రభుత్వ పాఠశాలల సంఖ్య పెరిగినా వాటిలో విద్యార్థుల అడ్మిషన్లు (Admissions) మాత్రం తగ్గాయి. 2023–24 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 4.45 లక్షల వరకు తగ్గింది. ప్రైవేట్ పాఠశాలల్లో 5.37 లక్షల కొత్త విద్యార్థులు చేరారు. తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలను ఎక్కువగా నమ్ముతున్నారనడానికి ఇది నిదర్శనం. ప్రభుత్వ పాఠశాలలు ఇంగ్లిష్ మీడియం అందిస్తున్నప్పటికీ ఇంకా ప్రైవేట్ స్కూల్స్‌లో మెరుగైన సౌకర్యాలు, వసతి, బోధనా పద్ధతులు, నాణ్యమైన విద్య ఉండటం ఇందుకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
డ్రాపవుట్ రేట్లు – ప్రధాన సవాళ్లు
విద్యార్థుల డ్రాపవుట్ రేట్లు కూడా రాష్ట్రానికి పెద్ద సవాళ్లుగా మారాయి. ముఖ్యంగా 9 – 12 తరగతుల విద్యార్థుల డ్రాపవుట్ రేటు 8 శాతం ఉంది. బాలురు ఎక్కువగా పాఠశాలలు మానేస్తున్నారు. వీరి డ్రాపవుట్ రేటు 9.6 శాతం ఉంది. అలాగే బాలికల డ్రాపవుట్ రేటు 6.3 శాతం ఉంది. దీన్ని అధిగమించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. తల్లిదండ్రులు తమ పిల్లల విద్యను కొనసాగించేందుకు ప్రోత్సహించేలా పలు ముఖ్యమైన పథకాలు అమలు చేస్తోంది. అవేమిటంటే..
- సమీప పాఠశాలలు: ప్రతి ఊరిలో ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో ఉండేలా ఏర్పాటు, దూరప్రాంతాల్లో బస్సుల సౌకర్యం కల్పడం.
- ఉచిత యూనిఫార్మ్స్, పుస్తకాలు: బాలికలకు ఎనిమిదో తరగతి వరకు ఉచితంగా యూనిఫార్మ్స్, పుస్తకాలు పంపిణీ చేయడం.
- స్వీయరక్షణ శిక్షణ: 6 నుంచి 12 తరగతుల వరకు చదివే బాలికలకు సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్.
- మధ్యాహ్న భోజన పథకం (Mid-day Meal Scheme): మంచి పోషకాహారాన్ని అందించేలా మెరుగైన ఆహారం అందించడం.
- కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య: ప్రాథమిక విద్య నుంచి డిగ్రీ వరకూ విద్య ఉచితంగా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది. పాఠశాలల మౌలిక సౌకర్యాలు
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల్లో భాగంగా అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. పాడుబడిన పాఠశాల భవనాలను తొలగించి కొత్తవి నిర్మిస్తున్నారు. అన్ని పాఠశాలల్లో విద్యుత్ సౌకర్యం కల్పించారు. బాలికల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. పాఠశాల పరిసరాల పరిశుభ్రతపై దృష్టి పెట్టారు.
విద్యా రంగానికి ఎదురైన సమస్యలు
- కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా పాఠశాలల సంఖ్య తక్కువగానే ఉంది.
- బాలికల విద్యా ఆవశ్యకతపై మరింత అవగాహన పెరగాల్సి ఉంది.
- పలు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది.
- కొన్ని పాఠశాలల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది.
- ఇంగ్లిష్ మీడియం విద్యను మరింత మెరుగుపరచాల్సి ఉంది.
- తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్స్ వైపు మొగ్గుచూపుతున్న దృష్ట్యా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఉత్తమ ప్రమాణాలతో విద్య అందించాల్సి ఉంది.
- అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్‌రూంలు, కంప్యూటర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలి.
- గ్రామీణ ప్రాంతాల పిల్లలు సులభంగా పాఠశాలకు వెళ్లేలా ఉచిత బస్సులు అందుబాటులోకి తేవాలి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..