- ప్రభుత్వ విధులు నిర్వహిస్తూనే బిల్డర్ గా రాణిస్తున్న ఉపాధ్యాయుడు
- ఇండ్లు కట్టిస్తాడు… టీచర్లకే అమ్ముతాడు
- పాఠాలు చెప్పడంకంటే ఇండ్లు కట్టించి అమ్మడంపైనే సారు దృష్టి
- అండగా మరో నలుగురు ఉపాధ్యాయులు..?
Govt Teacher as a Builder | పాఠాలు చెప్పాల్సిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నాడట. విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పడం అటుంచితే తోటి టీచర్ లకు రియల్ ఎస్టేట్ రంగంలో ఎలా రాణించాలో నేర్పిస్తున్నాడట. ఆ ఉపాధ్యాయుడికి పాఠాలు చెప్పడంకంటే కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడమంటేనే ఎక్కువ ఇష్టమట. గత కొన్నిసంవత్సరాలుగా రియల్ రంగంలో రాణిస్తున్న సదరు ఉపాధ్యాయుడు అంచెలంచెలుగా ఎదిగి బిల్డర్ గా అవతరించినట్లు విద్యాశాఖలో జోరుగా చర్చ జరుగుతున్నట్లు తెలిసింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ చేస్తూ ప్రభుత్వ టీచర్ లకే ప్లాట్లు అమ్ముతూ కోట్లకు పడగలెత్తిన్నట్లు టీచర్ లు కోడైకూస్తున్నారు. సదరు ఉపాధ్యాయుడు రియల్ ఎస్టేట్ రంగంలో ప్రభుత్వ టీచర్ లే లక్ష్యంగా తన వ్యాపారాన్ని కొనసాగిస్తూ టీచర్ కమ్ బిల్డర్ గా పేరు పొందినట్లు విశ్వసనీయ సమాచారం.
అండగా ఆ నలుగురు…
బిల్డర్ గా అవతరించిన ఆ ప్రభుత్వ టీచర్ కు పెట్టుబడులు పెట్టేందుకు ,వ్యాపారాన్ని విస్తరించేందుకు మరో నలుగురు ఉపాధ్యాయులు తోడుగా నిలుస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తున్న సదరు ఉపాధ్యాయుడికి ఆ నలుగురు టీచర్ లు తోడవ్వడంతో ఆ ఉపాధ్యాయుడి రియల్ వ్యాపారం మూడుపువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నట్లు తెలుస్తోంది.ఆ టీచర్ చేసే ప్రతి పనిలో అనగా ప్లాట్లు, ఇండ్లు అమ్మడంలో ఈ నలుగురే కీలకపాత్ర పోషిస్తారని సదరు ఉపాధ్యాయుడికి వ్యాపార రంగంలో ఏదయినా సమస్య వస్తే ఆ నలుగురు ఉపాధ్యాయులు అండగా నిలబడుతారని, ఆయన చేసే ప్రతి పనిలో ఈ నలుగురి పెట్టుబడి ఖచ్చితంగా ఉంటుందని టీచర్లు చెవులు కోరుకుంటున్నారు.
టీచర్లకు మాత్రమే అమ్ముతాడు…
ప్రభుత్వ టీచర్ గా విధులు నిర్వహిస్తున్న సదరు వ్యక్తి కొన్ని సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతూ బిల్డర్ గా ఎదగడం తోటి ఉపాధ్యాయులనే ఒకింత ఆశ్చర్యానికి గురిచేసిందని టీచర్ లు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఈ టీచర్ అందరు రియల్టర్ లలా కాదని సాధారణంగా రియల్టర్ లు వ్యాపారం చేసినట్లు ఇతగాడు చేయడని స్పష్టంగా తెలిసింది. ఇతగాడు రియల్ ఎస్టేట్ కేవలం ఓ వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తాడని ప్లాట్లు అమ్మాలన్న,ఇండ్లు కట్టించి అమ్మాలన్న కేవలం టీచర్ లకు మాత్రమే అమ్ముతాడని విశ్వసనీయ సమాచారం.ఇతడు కట్టించి అమ్మిన ఇండ్లు దాదాపు రెండు సంవత్సరాల్లోపే రిపేర్ కు వస్తాయని కొన్ని ప్లాట్లు లిటికేషన్ లో ఉన్నాయని టీచర్ లలో చర్చ సాగుతోంది. ఇదేంటని ప్రశ్నించిన వారిని తన కోటరీ తో ఇబ్బందులకు గురిచేస్తాడని కొంతమంది ఉపాధ్యాయులు ఎవరికి చెప్పుకోలేక లోలోపల మదనపడుతున్నారట.
టీచర్ గా కంటే రియల్టర్ గా ఫేమస్ …
ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ నిబంధనల కు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ చేస్తున్న ఆ ఉపాధ్యాయుడు ఓరుగల్లులో బాగా ఫేమస్ అయ్యాడని ఉమ్మడి వరంగల్ జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని ఓ డివిజన్ లో ఉండే ఈ టీచర్ రియల్ ఎస్టేట్ చేస్తూ దండిగానే వెనకేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సదరు టీచర్ కమ్ రియల్టర్ ఉండే ఆ డివిజన్ లో ఏ ప్లాటు కానీ ఇల్లు కానీ అమ్మాలన్న, కొనాలన్న అతగాడి అనుమతితోనే జరుగుతున్నట్లు ఆ డివిజన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ ఉపాధ్యాయుడు ఓరుగల్లులో టీచర్ గా కంటే కూడా రియల్టర్ గానే ఎక్కువ గుర్తింపు పొందినట్లు తెలిసింది. అది ఏ స్థాయిలో అంటే ఆ ఏరియాలో ఆయన పేరు చెప్తే అతనో బడా రియల్టర్ అని ఈ మధ్యే బిల్డర్ గా కూడా అవతరించినట్లు చెప్పుకుంటున్నారు..
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..