Hyderabad : రాష్ట్ర ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హ్యామ్) ప్రాజెక్ట్‌ను అమలు చేస్తూ గ్రామీణ రహదారుల అభివృద్ధికి సిద్దమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని, దాంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు.
మంత్రి సీతక్క ప్రకారం.. హ్యామ్ ప్రాజెక్టుల (HAM roads) కోసం టెండర్ నోటిఫికేషన్ శుక్రవారం విడుదల చేయనున్నారు. మొదటి దశలో 7,449.50 కిలోమీటర్ల పొడవుతో 2,162 రహదారులు నిర్మించనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. ఇవి మొత్తం 96 నియోజకవర్గాల పరిధిలో 17 ప్యాకేజీల కింద చేపట్టనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ – “హ్యామ్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ గ్రామీణ రహదారులు కొత్త దశలోకి ప్రవేశిస్తాయి. జాతీయ, అంతర్జాతీయ రహదారి సంస్థలు ఈ టెండర్లలో పాల్గొనాలని కోరుతున్నాం” అని తెలిపారు. ఈ విధానంలో ప్రాజెక్టు వ్యయానికి 40% ప్రభుత్వం నిర్మాణ దశలో చెల్లిస్తుండగా, మిగిలిన 60% మొత్తాన్ని కాంట్రాక్టర్లు బ్యాంకుల ద్వారా సమీకరిస్తారు. పనులు పూర్తయ్యాక రహదారుల నిర్వహణ బాధ్యత 15 ఏళ్లపాటు కాంట్రాక్టర్లు వహించాల్సి ఉంటుంది.
ప్రభుత్వం ఈ ప్రాజెక్టును మూడు దశల్లో అమలు చేయాలని నిర్ణయించింది. ఫేజ్-1కి సంబంధించిన టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ స్టడీ పూర్తయింది. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, ఎంపీల సూచనల ఆధారంగా పంచాయతీరాజ్ ఇంజనీర్లు పనులను ఎంపిక చేశారు. కేబినెట్ ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదనలు ఆమోదించింది. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.6,294.81 కోట్లు కాగా, దీనికి ఆర్థిక అనుమతి కూడా లభించింది. పంచాయతీరాజ్ ఇంజనీర్-ఇన్-చీఫ్ జోగారెడ్డి ప్రకారం, టెండర్ ప్రక్రియను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పేపర్ నోటీసు ద్వారా టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే పనులు ప్రారంభం కానున్నాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    