ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై హరీశ్ రావు ఆగ్రహం
హైదరాబాద్ : రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధుల విడుదలలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని మాజీ మంత్రి టీ హరీశ్ రావు (BRS MLA Harish Rao )  విమర్శించారు. రెండేళ్లుగా యాజమాన్యాలు నిధులు ఇవ్వమని వేడుకుంటున్నా, రేవంత్ సర్కారు మోసపూరిత వైఖరి అవలంబిస్తోందని ఆయన మండిపడ్డారు.
ఈసందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ, ఇంజినీరింగ్ కళాశాలలు మూతపడే పరిస్థితి వచ్చింది.దాదాపు 13 లక్షల విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాల్సిన దశ రావడం సిగ్గుచేటు. ముఖ్యమంత్రి తానే విద్యాశాఖ మంత్రిగా ఉన్నా చర్యలు తీసుకోకపోవడం ఆందోళనకరంగా ఉన్నాయి. ఇప్పటికే సెప్టెంబర్ 16 నుంచి విద్యాసంస్థల యాజమాన్యాలు నిరసనలు, నిరాహార దీక్షలు, నిరవధిక బంద్‌లు చేపడతామని ప్రకటించాయి. కానీ ప్రభుత్వం ఇంకా స్పందించకపోవడం దారుణం అని హరీష్ రావు అన్నారు.
ఉద్యోగులకు జీతాలు, ఉపాధ్యాయులకు డీఏలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ ఇవ్వలేనని చెప్పే ప్రభుత్వం… ఎలా లక్షల కోట్ల టెండర్లు పిలుస్తోందని హరీష్ రావు ప్రశ్నించారు. ఫ్యూచర్ సిటీకి ₹20,000 కోట్ల టెండర్లు, మల్లన్నసాగర్ నుంచి మూసీకి నీళ్లు తరలించేందుకు ₹7,000 కోట్ల టెండర్లు, GHMC లో బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లకు మరో ₹7,000 కోట్ల టెండర్లు, ఆర్&బీ శాఖలో ₹16,000 కోట్ల టెండర్లు, HMDAలో ₹10,000 కోట్ల టెండర్లు, గురుకులాలపై నిర్లక్ష్యం, కానీ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు ₹25,000 కోట్ల టెండర్లు, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్‌కు ₹4,400 కోట్ల టెండర్లు
మూసీ సుందరీకరణకు ₹1.5 లక్షల కోట్ల టెండర్లు పిలిచారని మాజీ మంత్రి (Harish Rao) ఆరోపించారు. “రెండు లక్షల కోట్లకు పైగా టెండర్లు పిలిచి కమిషన్లు దండుకుంటున్న ప్రభుత్వం… విద్యార్థుల చదువు పట్ల మాత్రం శ్రద్ధ చూపడంలేదని ధ్వజమెత్తారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    