- చర్చనీయాంశంగా హసన్ పర్తి తహశీల్దార్ లీలలు..
- కాసులు కురిపించిన నాలా కన్వర్షన్ లు..?
Hanmakonda : ఆ తహశీల్దార్ (Tahsildar) లీలలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి, సదరు తహశీల్దార్ పై చర్యలు తీసుకోవాలని కొంతమంది ప్రజలు మంత్రి కి సైతం ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా సదరు తహశీల్దార్ గురించే మాట్లాడుకుంటున్నారట. తెలంగాణ శాసనసభ ఎన్నికల కు ముందు బదిలీల్లో భాగంగా హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండల తహశీల్దార్ బాధ్యతలు చేపట్టిన సదరు అధికారి విధుల్లో చేరినప్పటినుండి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. తన పరిధిలో ఉన్న అక్రమ(అనుమతి లేని)వెంచర్ (Illegal venture) లలోని ప్లాట్లను వేంచర్ నిర్వాహకులకు అనుకూలంగా గజాల వారీగా ప్లాట్లను కన్వర్షన్ చేసి పెద్దమొత్తంలో ముడుపులు దండుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.అంతేకాకుండా ఎప్పటినుండో వివాదాస్పదంగా ఉన్న ఓ భూమి నుండి 8 గుంటలు నాలా కన్వర్షన్ చేయడం ఇప్పుడు ఆయనకు తలనొప్పిగా మారిందట. దీంతోపాటు గత తహశీల్దార్ రిజెక్ట్ చేసిన భూమికి పాస్ బుక్ జారీచేయటం దీనిపై కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో తహశీల్దార్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు సమాచారం
సర్వే నెంబర్ 401 కథేంటి?
హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం వంగపహాడ్ గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న సర్వే నెంబర్ 401 (survey number 401) లోని 3 ఎకరాల 12 గుంటల భూమి కి పాస్ బుక్ జారీ చేయాలని పట్టాదారు అప్లికేషన్ పెట్టుకోగా గత తహశీల్దార్ నాగేశ్వరరావు ఫీల్డ్ విజిట్ చేసి ఫీల్డ్ మీద వేరే వ్యక్తి ఉండడంతో సదరు తహశీల్దార్ ఆ ఫైలును రిజెక్ట్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికీ ఆ భూమికి సంబంధించిన రిజెక్ట్ చేసిన ఫైలు ఆ కార్యాలయంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. మరి సదరు తహశీల్దార్ రిజెక్ట్ చేసిన భూమికి ప్రస్తుత తహశీల్దార్ పాస్ బుక్ జారీ చేయడం వెనుక మర్మమేమిటో ఆ అధికారికే తెలియాలి. ఈ పాస్ బుక్ జారీ కావడం వెనుక “లకారాల” రహస్యం దాగిఉందని, పెద్దమొత్తంలో చేతులు మారడం మూలంగానే గత తహశీల్దార్ (Tahsildar)లు రిజెక్ట్ చేసిన ఫైలును ప్రస్తుత తహశీల్దార్ అప్రూవ్ చేశారని మండలంలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఎల్లాపూర్ లో గందరగోళం…
హసన్ పర్తి (Hasanparthi) మండలం ఎల్లాపూర్ (Ellapur) గ్రామంలోని 8 గుంటల నాలా కన్వర్షన్ (nala conversion) హన్మకొండ జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.రియల్టర్ తో తహశీల్దార్ అవగాహన కుదుర్చుకోవడం వల్లే ఆ భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా నాలా కన్వర్షన్ చేశారని గ్రామంలో బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు.ఇప్పటికే కొంతమంది ఎల్లాపూర్ ప్రజలు ఆర్డీవో (RDO) కు, కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా, తాజాగా గురువారం మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) ను కలిసి తహశీల్దార్ పై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిసింది. గ్రామస్తులు ఆరోపిస్తున్నట్లు ఆ భూమిని క్షేత్ర స్థాయిలో పరిశీలించకుండా సదరు తహశీల్దార్ నాలా కన్వర్షన్ ఎందుకు చేసినట్లు..?తెరవెనుక ఏంజరిగింది..? ముడుపులే కారణమా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా సదరు తహశీల్దార్ విధుల్లో చేరినప్పటినుండి అనేక అనుమతి లేని వెంచర్ లలోని వందలాది ప్లాట్లను గజాల వారీగా నాలా కన్వర్షన్ చేసి రియల్టర్ లకు సహకరించినట్లు సమాచారం.నాన్ లేఅవుట్ వెంచర్ లలోని ప్లాట్లను నాలా కన్వర్షన్ చేయడం వల్ల కాసుల వర్షమే కురిసిందని రెవెన్యూ శాఖ (Revenue Department)లో పెద్దఎత్తున ప్రచారం జరుగుతుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..