Kancha Gachibowli : తెలంగాణ రాష్ట్రంలో అత్యంత సంచలనంగా మారిన కంచ గచ్చిబౌలి భూవివాదం (Kancha Gachibowli issue)పై రాజకీయాలు వేడెక్కాయి. నిండు పచ్చదనం ఉన్న ఈ ప్రదేశంలో వంద ఎకరాల అరణ్యాన్ని ధ్వంసం చేసిన వ్యవహారంపై సుప్రీంకోర్టు (Supreme Court) సహా ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, పర్యావరణ కార్యకర్తలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ (Congress party)పై విమర్శలు పెరిగాయి. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకోవడానికి ఆ పార్టీ హైకమాండ్ రంగంలోకి దిగింది.
రాహుల్ గాంధీ మౌనం.. విపక్షాల ఆరోపణలు
ఏఐసీసీ (All India Congress Committee) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇప్పటి వరకు ఈ వ్యవహారంపై ఎటువంటి ప్రకటన చేయకపోవడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం, కేసులు నమోదు చేయడం, ఆందోళనలపై ప్రభుత్వ కఠిన వైఖరిపై విమమర్శలు గుప్పుమన్నాయి. పర్యావరణ పరిరక్షణపై కాంగ్రెస్‌కు బాధ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రంగంలోకి కాంగ్రెస్ ఇన్చార్జ్
ఈ వివాదంపై తాజాగా కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ (AICC Telangana incharge Meenakshi Natarajan) రంగంలోకి దిగారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముగ్గురు మంత్రుల కమిటీతో ఆమె ఈ రోజు సమావేశమయ్యారు. ఈ కమిటీలో డిప్యూటీ సీఎం మళ్లు భట్టి విక్రమార్క (Deputy Chief Minister Mallu Bhatti Vikramarka), పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Industries Minister D Sridhar Babu), రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Revenue Minister Ponguleti Srinivas Reddy) ఉన్నారు. ఈ సమావేశం ద్వారా భూ వివాదంపై క్లారిటీ తీసుకురావాలని భావిస్తున్నారు.
ఎన్ఎస్యూఐ నాయకులతో సమావేశం
ఎన్ఎస్యూఐ నాయకు (NSUI leaders)లతో కూడా మీనాక్షి నటరాజన్ గాంధీ భవన్లో ప్రత్యేక సమావేశమయ్యారు. కంచ గచ్చిబౌలిలో చెట్ల నరికి, భూముల విధ్వంసంపై ఎన్ఎస్యూఐ కూడా ఘాటుగా స్పందించింది. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా విమర్శించింది.
సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఇప్పటికే సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై సుమోటోగా విచారణ ప్రారంభించింది. ఏప్రిల్ 16లోగా పూర్తి నివేదిక సమర్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు రిజిస్ట్రార్ అందించిన తాత్కాలిక నివేదికలో ప్రభుత్వం ఐటీ పార్క్ ఏర్పాటు కోసం భూమిని వేలం వేయాలని యత్నించిందని, దీనికోసం వంద ఎకరాల చెట్లను నరికివేసినట్టు వెల్లడించారు. సుప్రీంకోర్టు వెంటనే ఈ పనులపై తాత్కాలిక స్టే విధించింది.
Kancha Gachibowli భూములపై యూనివర్శిటీ వ్యతిరేకత
రాష్ట్ర ప్రభుత్వం భూములపై తమకే యాజమాన్యం ఉందని అంటుండగా హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఈ విషయాన్ని ఖండిస్తోంది. వివాదాస్పద భూములపై సరైన సర్వే జరగలేదని, తమ భూసరహద్దుల్లో ఈ భూములు ఉన్నాయని వాదిస్తోంది. విశ్వవిద్యాలయ భూముల్ని వాణిజ్య కోణంలో ఉపయోగించాలన్న ప్రభుత్వ యత్నంపై విద్యార్థులు, అధ్యాపకులు తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
పర్యావరణ పరిరక్షణపై ప్రశ్నలు
ఇప్పటికే తెలంగాణ ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై ప్రభుత్వ నిబద్ధతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముష్కర వృత్తిలో భూములు ఆక్రమించి, ఐటీ అభివృద్ధి పేరిట అడవులను నరికి భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
భూ వివాదానికి ఫుల్స్టాప్ పెట్టేనా?
ఈ వివాదం రాజకీయంగా కాంగ్రెస్ మనుగడకు మారే ప్రమాదం ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఒకవైపు పర్యావరణ పరిరక్షణ గురించి ప్రసంగాలు చేస్తూ, మరోవైపు భూవినియోగం కోసం అడవులను నరికి ప్రాజెక్టులు చేపట్టడంపై ఆ పార్టీపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను హైకమాండ్ రంగంలోకి దింపిందని తెలుస్తోంది. ఈ భూవివాదం కారణంగా పార్టీ మనుగడకు ముప్పు వాటిల్లకుండా చర్యలకు పూనుకుంది. ఈ వివాదాన్ని ఇక్కడికే పరిసమాప్తం చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.