Warangal : ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరోసారి భారీ వర్షం కురిసింది. మంగళవారం ఉదయం నుంచి పలుచోట్ల వరుసగా కుండపోత వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వరంగల్ నగరంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సుమారు అరగంటపాటు పడిన వర్షానికి రహదారులపై వరద నీరు చేరింది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వర్షానికి ఎనుమాముల మార్కెట్‌లో అమ్మకానికి తెచ్చిన పత్తి, మొక్కజొన్న తడిసిపోవంతో రైతులు కన్నీరుమున్నీరయ్యారు. ఇటీవల ‘మొంథా’ తుపాను ప్రభావం నుంచి ఇంకా పూర్తిగా తేరుకోని వరంగల్, హన్మకొండ, కాజీపేట ప్రాంతాలు మరోసారి వర్షాల ముంపు భయంతో వణికిపోతున్నాయి.
రేపు వర్షం కురిసే అవకాశం
తెలంగాణ వెదర్ మాన్ అంచనా ప్రకారం వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, గద్వాల్, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి-భోంగీర్ జిల్లాల్లో రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్, జనగాం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
జీడబ్ల్యూఎంసీ పరిధిలో వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. మేయర్ గుండు సుధారాణి స్థానిక కార్పొరేటర్లు, అధికారులతో కలిసి పొతననగర్ (11వ డివిజన్)లో పర్యటించారు. నాలాల స్థితిని పరిశీలించి, నీరు నిల్వ ఉండకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇక హైదరాబాద్‌లో కూడా మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారింది. పలుచోట్ల జల్లులు కురిశాయి. వాతావరణ శాఖ ప్రకారం రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగే చాన్స్ ఉంది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అరేబియా సముద్రం నుంచి తెలంగాణ వైపు తేమ గాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీల మేర అధికంగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే గురువారం నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని అంచనా వేసింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








