Heavy rainfall : తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో వివిధ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వానలు ( heavy rainfall ) పడ్డాయి. దీంతో జనజీవనం (Normal life) అస్తవ్యస్తంగా మారింది. మరో రెండు, మూడు రోజుల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Heavy rainfall : జనజీవనం అస్తవ్యస్తం
భారీ వర్షాల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వాగులు, వంకలు ఉప్పొంగి రవాణా అంతరాయం కలిగిస్తున్నాయి. చిన్న చిన్న చెరువులు, గుంటలు పొంగిపొర్లి లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరుతోంది. పల్లెల్లో రహదారులు నీటమునిగిపోవడం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
పంట పొలాల్లోకి కూడా నీరు చేరడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా కొన్ని ప్రాంతాల్లో వరదలు, ముంపు సమస్యలు తలెత్తుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం నీటి కొరత కొనసాగుతోంది.
ఖమ్మం జిల్లాలో 579.9 మి.మీ వర్షపాతం
ఖమ్మం జిల్లాలో గడిచిన 24 గంటల్లో అతి భారీ వర్షం కురిసింది. శుక్రవారం ఉదయం 8.30 నుంచి శనివారం ఉదయం 8.30 గంటల వరకు 579.9 మి.మీ వర్షపాతం నమోదైంది. కొణిజర్లలో అత్యధికంగా 70.9 మి.మీ, సింగరేణి 61.4, వైరా 55.4, కుసుమంచి 47.8 , కామేపల్లి 46.7 మి.మీ వర్షపాతం రికార్డు అయ్యింది. ఎర్రుపాలెం మండలంలో వర్షం లేదు.
మెదక్ జిల్లాలో 128 మి.మీ
మెదక్ జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు కొన్ని ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. అత్యధికంగా శివంపేటలో 128 మి.మీ వర్షం పడింది. నర్సాపూర్ 108.8, కాగజ్ మద్దూర్ 98.8, పెద్ద శంకరంపేట 89, బోడగట్టు ఈఎస్ఎస్ 74.5, కాళ్లకల్ 68 మి.మీ వర్షాలు కురిశాయి.
నల్లగొండ జిల్లాలో 40.1 మి.మీ
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. గడిచిన రెండు రోజుల్లో 40.1 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం రికార్డు అయ్యింది. దీంతో జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపోతున్నాయి. దాదాపు అన్ని చెరువులు, కుంటలు మత్తడి దూకుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయయ్యాయి. పొలాల్లోకి వర్షపు నీరు చేరడంతో రైతులు నష్టపోయారు.
వరంగల్ జిల్లాలో 40.0 మి.మీ
వరంగల్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో భారీ వర్షం కురిసింది. నిన్న ఉదయం 8.30 నుంచి ఈ రోజు ఉదయం 6 గంటల వరకు జిల్లాలో సగటు వర్షపాతం 40.0 మి.మీ రికార్డు అయ్యింది. నల్లబెల్లి మండలంలో అత్యధికంగా 114.8 మి.మీ వర్షం కురిసింది. దుగ్గొండి 99.5 మి.మీటర్లు, నర్సంపేట 61.8 మి.మీటర్ల సంగెం 12.9 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న రెండు రోజుల్లో (ఈ నెల 17, 18 తేదీలు) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వరంగల్ కలెక్టర్ సత్య శారద తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్లో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆమె అధికారులకు ఈ మేరకు సూచనలు చేశారు. వాగులు, వంకల సమీపంలో ఉన్న ప్రమాదకరమైన రోడ్లపై ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.
అతలాకుతలమైన ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలు
ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో శనివారం ఉదయం వరకు కురిసిన మోస్తరు నుంచి భారీ వర్షాలు ప్రజల జీవితాలను పూర్తిగా దెబ్బతీశాయి. వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లి రవాణా స్తంభించింది. పంటలు కూడా తీవ్రంగా నష్టపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలో తలమడుగు, ఇచోడ, ఇంద్రవెల్లి, జైనాథ్, గుడిహత్నూర్, బజార్హత్నూర్, బోత్, ఉట్నూర్, సిరికొండ, నేరడిగొండ మండలాల్లో రాత్రి నుంచి ఉదయం వరకు భారీ వర్షాలు కురిశాయి. ఉట్నూర్‌లోని వంకతుమ్మ వాగు, సిరికొండలోని చిక్మన్ వాగు పొంగిపొర్లాయి. దూరప్రాంత గ్రామాల ప్రజలు రహదారి దెబ్బతినడంతో మాండల కేంద్రాలు, పట్టణాలకు చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వైద్య అవసరాలు, రోజువారీ సరుకులు తెచ్చుకోవడం కష్టంగా మారింది. మంచిర్యాల జిల్లాలో భీమిని, కన్నేపల్లి, నస్పూర్, హజీపూర్, బెల్లంపల్లి, మందమర్రి, భీమారం, డండేపల్లి, లక్సెట్టిపేట, తాండూర్ మండలాల్లో 15 మిల్లీమీటర్ల నుంచి 125 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. లక్సెట్టిపేటలోని సత్యసాయి నగర్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు రాత్రంతా నిద్రలేక ఇబ్బంది పడ్డారు. మందమర్రిలో ఒక కాలనీ నీటమునిగిపోయింది. మంచిర్యాల పట్టణంలోని LIC కాలనీ, తిరుమలగిరి, రామనగర్ కాలనీల్లో ఇళ్లలో నీరు చేరింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    