Heavy Rains in Telangana : తెలంగాణలో ఎడతెరపిలేకుండా భారీ వర్షాలు (heavy rains) కురుస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ (southern Telangana)లోని అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. ఇంకా ఇవి కొనసాగొచ్చని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌తోపాటు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట తదితర జిల్లాల్లో ఈ రోజు సాయంత్రం నుంచి రేపు ఉదయం వరకు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.
Heavy Rains : ఎక్కడెక్కడ అంటే..
ప్రస్తుతం ఉన్న తక్కువ వాయు పీడన (low-pressure) పరిస్థితులు సముద్ర మట్టం నుంచి పైపొరల వరకు చురుగ్గా ఉన్నాయి. దీని కారణంగా వర్షపాతం మరింత పెరిగే అవకాశం ఉంది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, ఆదిలాబాద్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, నిర్మల్ వంటి జిల్లాల్లో ఈ రోజు రాత్రి నుంచి రేపు ఉదయం వరకు బలమైన వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. హైదరాబాద్‌లో ఉదయం వరకు స్వల్ప వర్షాలు, మధ్యాహ్నం తర్వాత మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వచ్చే 24 గంటల్లో నగరంలో 30–60 మిల్లీమీటర్ల వరకు వర్షం పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. అయితే.. తక్కువ ఒత్తిడి ప్రభావం వల్లే వర్షాలు కురుస్తున్నాయని, ఇది ఇంకా 24 గంటలు కొనసాగుతుందని అంచనా వేస్తోంది. దాని తర్వాత వర్షాల తీవ్రత క్రమంగా తగ్గే అవకాశం ఉంది. ఈలోపే దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో మళ్లీ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముంది.
నిండుతున్న జలాశయాలు.. మునుగుతున్న పొలాలు
వర్షాలు కురుస్తున్న సమయంలోనే వికారాబాద్ జిల్లాలోని కొన్ని మండలాల్లో భూకంపం రావడం భయాందోళన కలిగించింది. అలాగే ఎడతెరిపి లేకుండా పడుతున్న భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో పత్తి పంటలు నీటమునిగిపోయాయి. కొన్ని చెరువులు నిండిపోయి మత్తుళ్లు పడుతున్నాయి. కుంటలు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో కొన్ని గ్రామాల్లో రహదారులు ముంపునకు గురై వాహన రాకపోకలు అంతరాయం ఏర్పడింది. పంట పొలాల్లో నిల్వ నీరు ఎక్కువకాలం ఉంటే, పంటలు పాడయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Rains in Telangana : హైదరాబాద్ పరిస్థితి ఏమిటి?
నగరంలో రహదారులపై ఇప్పటికే నీరు నిలిచిపోవడం, ట్రాఫిక్ స్లో కావడం వంటి సమస్యలు మొదలయ్యాయి. ముఖ్యంగా తక్కువ ఎత్తున్న ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరే అవకాశం ఉండటంతో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర సిబ్బంది సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నారని GHMC అధికారులు తెలిపారు.
జాగ్రత్తలు పాటించాలంటున్న అధికారులు
అవసరం లేకుండా బయటకు వెళ్లొద్దని తెలంగాణ ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. వర్షాలు కొనసాగుతున్న దృష్ట్యా విద్యుత్ స్తంభాల దగ్గర, చెట్లు, ఓపెన్ ప్లేస్‌లలో ఎక్కువ సేపు నిలవకుండా జాగ్రత్త వహించాలని అంటున్నారు. రైతులు పంట పొలాల్లో నీరు నిల్వ కాకుండా చూడాలని, చెరువుల ముంపు నుంచి పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచిస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    