Heavy rains : భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ (Hyderabad) కేంద్రం తాజాగా జారీ చేసిన అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఏడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఇప్పటికే సెప్టెంబరు చివరి వారంలో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని సూచనలు వెలువడగా, ఇప్పుడు మరింత స్పష్టమైన హెచ్చరికను విడుదల చేశారు.
మోస్తరు నుంచి భారీ వర్షాలు
రాష్ట్రమంతా భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తూ India Meteorological Department (IMD) ఎల్లో అలర్ట్ (yellow alert) జారీ చేసింది. సెప్టెంబరు 28 వరకు ఇది కొనసాగనుంది. తెలంగాణలోని ఉత్తర, మధ్య, పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని IMD వెల్లడించింది. పలు జిల్లాల్లో వర్షాలు, పిడుగులు, ఈదురుగాలులు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయని తెలిపింది. కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ రాబోయే వర్షాల కారణంగా వాతావరణం చల్లబడనుంది. రైతులకు ఈ వర్షాలు ఒక విధంగా అనుకూలమైనప్పటికీ నగరాల్లో రోడ్లు జలమయం కావడంతోపాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
Heavy rains : హైదరాబాద్‌లో వాతావరణం
హైదరాబాద్‌లో కూడా వర్షాల ప్రభావం ఉంటుంది. ఉదయం వరకు పొడి వాతావరణం కొనసాగి, మధ్యాహ్నం తర్వాత నుంచి రాత్రి వరకూ ఒకట్రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి. నగరంలో రహదారులు వర్షపు నీటితో నిండిపోవడం, ట్రాఫిక్ రద్దీ పెరగడం సాధారణం కావడంతో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షాల సమయంలో అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు వెళ్లకుండా ఉండటం మంచిదని అంటున్నారు. రోడ్లపై నీరు నిలిచిన చోట్ల వాహనాలను నడపొద్దని తెలిపారు. విద్యుత్ స్తంభాలు, చెట్లు వంటి వాటికి దూరంగా ఉండాలని, పిడుగులు పడే సమయంలో ఓపెన్ ఏరియాల్లో ఉండకూడదని సూచిస్తున్నారు.
పంటలకు మిశ్రమ ప్రభావం
ఈ వర్షాలు పలు పంటలకు మేలు చేస్తాయని అంటున్నారు వ్యవసాయ నిపుణులు. వరి, మొక్కజొన్న, కూరగాయలు సాగుకు ఇవి అనుకూలం అంటున్నారు. అధిక వర్షపాతం వల్ల పంటలు నీట మునిగిపోతే మాత్రం నష్టం కలగొచ్చని తెలిపారు. కాబట్టి రైతులు వర్షాల అంచనాలను బట్టి చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
వాతావరణం ఎలా ఉంటుందంటే..
- సెప్టెంబరు 22 నుంచి 25 వరకు : మోస్తరు నుంచి భారీ వర్షాలు
- సెప్టెంబరు 26 నుంచి 28 వరకు : పలు ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు, పిడుగులు.
- హైదరాబాద్‌లో ఎక్కువగా మధ్యాహ్నం తర్వాత వర్షాలు కురుస్తాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    