Hindenburg Research : హిండెన్‌బర్గ్ రిసెర్చ్ సంస్థ మూతపడింది. తమ కార్యకలాపాలను ఇక కొనసాగించలేమని యాజమాన్యం ప్రకటించింది. ఇందులో ఎవరి ఒత్తిడి లేదని, తమ ప్రాజెక్టుల లక్ష్యాలు పూర్తయిన నేపథ్యంలో హిండెన్‌బర్గ్ రిసెర్చ్ సంస్థను మూసివేస్తున్నామని ఆ సంస్థ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ వెల్లడించారు. అయితే.. ఈ ప్రకటన తర్వాత స్టాక్ మార్కెట్‌లో సానుకూల వాతావరణం నెలకొంది. ముఖ్యంగా గౌతమ్ అదానీ గ్రూప్‌నకు చెందిన షేర్లు ఒక్కసారిగా భారీగా పెరుగుతున్నాయి.
నష్టం నుంచి లాభాల వైపు
రెండేళ్ల క్రితం ఇదే నెలలో హిండెన్‌బర్గ్ నివేదిక కారణంగా గౌతమ్ అదానీ 100 బిలియన్ డాలర్లు నష్టపోయారు. తాజాగా హిండెన్‌బర్గ్ రిసెర్చ్ సంస్థ మూసివేత వార్తల నేపథ్యంలో అదానీ షేర్లు భారీగా పెరుగుతున్నాయి. షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ మూసివేయాలనే నిర్ణయం ప్రభావం అదానీ గ్రూప్ షేర్లపై స్పష్టంగా కనిపిస్తోంది.
అదానీ షేర్లు పెరిగాయి ఇలా..
హిండెన్‌బర్గ్ రిసెర్చ్ సంస్థ మూసివేత ప్రకటనతో స్టాక్ మార్కెట్‌పై సానుకూల ప్రభావం పడింది. ముఖ్యంగా అదానీ గ్రూప్‌నకు చెందిన కంపెనీల షేర్లు గణనీయంగా పెరిగాయి. 4.16% పెరుగుదలతో ₹2485 వద్ద అదానీ ఎంటర్‌ప్రైజెస్ ట్రేడ్ అయ్యింది. అదానీ పోర్ట్స్ 3.61% పెరిగి ₹1172 వద్ద ఉంది. అదానీ పవర్ 4.79% పెరిగి ₹576 వద్ద ట్రేడ్ అయ్యింది. అదానీ గ్రీన్ ఎనర్జీ 4.91% పెరిగి ₹1086 వద్ద ట్రేడ్ అయ్యింది.
Hindenburg Research అంటే ఏమిటి?
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అనేది అమెరికాలోని న్యూయార్క్ ఆధారిత సంస్థ. 2017లో దీనిని స్థాపించారు. మార్కెట్‌లోని పెట్టుబడులపై పరిశోధన చేసి విశ్లేషించడం హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ ముఖ్యోద్దేశం. ప్రధానంగా కంపెనీల అక్రమాలు, మోసాలు, అనైతిక వ్యాపార పద్ధతులను ఇది బయటపెడుతుంది. ఈ విధంగా బయటపెట్టిన సమాచారాన్ని బట్టి పెట్టుబడిదారులు తమ నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది.
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఎలా పనిచేస్తుంది?
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ కంపెనీలపై లోతైన పరిశోధన చేస్తుంది. ఆ కంపెనీల ఆర్థిక నివేదికలు, వ్యాపార ప్రణాళికలు, పత్రాలు వంటి వాటిని విశ్లేషిస్తుంది. అంతేకాకుండా ఆ కంపెనీలతో సంబంధం ఉన్న వ్యక్తులతో మాట్లాడి, వారి నుంచి సమాచారాన్ని సేకరిస్తుంది. ఈ విధంగా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి ఆ కంపెనీలోని అక్రమాలు, మోసాలు ఉంటే వాటిని బయటపెడుతుంది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి సలహాలను అందించడానికి తాము వినూత్న విశ్లేషణ పద్ధతులను ఉపయోగిస్తామని హిండెన్ బర్గ్ సంస్థ పేర్కొంది. ముఖ్యంగా కంపెనీలలో జరిగే అకౌంటింగ్ మోసాలు, సర్వీస్ ప్రొవైడర్ అక్రమాలు, చట్టవిరుద్ధమైన, అనైతిక వ్యాపార కార్యకలాపాలను బయటపెట్టడమే తమ లక్ష్యమని వెల్లడించింది.
అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ నివేదిక
హిండెన్‌బర్గ్ 2023 లో అదానీ గ్రూప్‌పై తీవ్రమైన ఆరోపణలు చేసింది. కంపెనీ స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసాలకు పాల్పడిందని పేర్కొంది. 2023 జనవరి 25న హిండెన్‌బర్గ్ అదానీ గ్రూప్: హౌ ది వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్ ఈజ్ పుల్లింగ్ ది లార్జెస్ట్ కాన్ ఇన్ కార్పొరేట్ హిస్టరీ పేరుతో 106 పేజీల నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికతో అదానీ గ్రూప్ భారీగా ఒత్తిడిని ఎదుర్కొంది. హిండెన్‌బర్గ్ చేసిన ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ తీవ్రంగా ఖండించింది.
అదానీ గ్రూప్ షేర్లలో పునరుత్తేజం
హిండెన్‌బర్గ్ (Hindenburg Research Report ) నివేదికల కారణంగా అప్పట్లో స్టాక్ మార్కెట్‌లో పెనుప్రభావం కనిపించింది. అదానీ గ్రూప్ షేర్లు భారీగా పతనమయ్యాయి. దీనివల్ల చిన్న మదుపరులు తీవ్రమైన నష్టాలను ఎదుర్కొన్నారు. తాజాగా హిండెన్‌బర్గ్ రిసెర్చ్ సంస్థ మూసివేతతో అదానీ గ్రూప్ కంపెనీల్లో పునరుత్తేజం వచ్చింది. మార్కెట్ పరిస్థితులు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఇక ఇలాంటి పరిణామాలు భారత మార్కెట్ స్థిరత్వాన్ని పెంచుతాయని నిపుణులు భావిస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..