- కనుమరుగవుతున్న హౌజింగ్ బోర్డు భూమి.. సర్వే నంబర్ 561లో అన్యాక్రాంతం
- హన్మకొండలోని ఓ ప్రముఖ హోటల్ కేంద్రంగా రాజకీయ నేతలు, రియల్ మాఫియా, అధికారులు కుమ్మక్కైనట్లు ఆరోపణలు.
- బుట్టదాఖలైన వరంగల్ ఆర్డీవో ఆదేశాలు
- కలెక్టర్ జోక్యo చేసుకుని సర్వే చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్
Gorrekunta Housing Board Land Encroachment | ప్రభుత్వ ఆస్తి కళ్లముందే కరిగిపోతోంది.. రక్షణగా ఉండాల్సిన యంత్రాంగమే మౌనముద్ర దాల్చింది. గీసుగొండ మండలం గొర్రెకుంట శివారులోని సర్వే నంబర్ 561 చుట్టూ ఇప్పుడు భారీ రాజకీయ చదరంగం నడుస్తోంది. అదృశ్య శక్తుల ఒత్తిడి, అధికారుల ఉదాసీనత వెనుక ఉన్న అసలు కథ ఇప్పుడు కీర్తినగర్ వాసుల్లో చర్చనీయాంశమైంది.
అశోక హోటల్ కేంద్రంగా ‘చక్రం’!
హన్మకొండలోని ఓ ప్రముఖ హోటల్ ఇప్పుడు అక్రమ సెటిల్మెంట్లకు అడ్డాగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హౌజింగ్ బోర్డు భూములను మింగేయాలని చూస్తున్న రియల్ మాఫియా, రాజకీయ నేతలు, అధికారులతో కలిసి ఇక్కడ వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. శాస్త్రీయంగా సర్వే జరిగితే తమ అక్రమ సామ్రాజ్యం కూలిపోతుందనే భయంతో, సర్వే ప్రక్రియను అడ్డుకునేందుకు లక్షల రూపాయలు చేతులు మారుతున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.

బుట్టదాఖలైన ఆర్డీవో మెమో!
ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నతాధికారుల ఆదేశాలకు విలువే లేకుండా పోయింది. వివాదాస్పద భూములను తక్షణమే సర్వే చేయాలంటూ వరంగల్ ఆర్డీవో (RDO) స్వయంగా మెమో జారీ చేసినా, క్షేత్రస్థాయి రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఫైళ్లు టేబుళ్లపై కదులుతున్నాయి తప్ప, సర్వే గొలుసు మాత్రం భూమి (Land Encroachment) మీద పడటం లేదు. చట్టం కంటే కబ్జాదారుల శక్తే మిన్నగా మారిందా అని ప్రజలు నిలదీస్తున్నారు.
అధికారుల ‘స్వామి’ భక్తి.. హౌజింగ్ బోర్డు ఆస్తికి శాపం!
హౌజింగ్ బోర్డు అధికారులు స్వయంగా ఫిర్యాదు చేసినా రెవెన్యూ విభాగం స్పందించకపోవడం వెనుక “క్విడ్ ప్రో కో” ఉందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఏదో ఒక సాకుతో సర్వేను వాయిదా వేస్తూ, కబ్జాదారులకు నిర్మాణాలు పూర్తి చేసుకునేందుకు పరోక్షంగా సమయం ఇస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా సేవ చేయాల్సిన కొందరు అధికారులు, కబ్జాదారుల సేవలో తరిస్తుండటం గమనార్హం.

keerthi nagar Land Encroachment : జిల్లా కలెక్టర్ స్పందించి సర్వే చేపించాలి
జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి హౌజింగ్ బోర్డు భూమిని సమగ్ర సర్వే నిర్వహించడంతోపాటు,భూమి చుట్టూ తక్షణమే సరిహద్దులు నిర్ణయించి ఫెన్సింగ్ వేయాలని,సర్వే చేయకుండా విధి నిర్వహణలో అలసత్వం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కీర్తినగర్ వాసులు డిమాండ్ చేస్తున్నారు.
జిల్లా యంత్రాంగం ఇకనైనా కళ్లు తెరవకపోతే, భవిష్యత్తులో ‘హౌజింగ్ బోర్డు భూమి’ అనేది కేవలం కాగితాలకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది. కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆస్తులను కాపాడతారా లేక ఆక్రమణదారులకు ధారాదత్తం చేస్తారా అనేది ఇప్పుడు కలెక్టర్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.








