- “బదిలీతో తహశీల్దార్ తప్పించుకున్నట్లేనా?”
- బరితెగించిన నిర్ణయాలు.. మున్సిపల్ ఆదాయానికి గండికొట్టి బదిలీపై వెళ్లిన తహశీల్దార్
- లేఅవుట్ అనుమతులు లేకుండానే హుజురాబాద్ లో వందలాది ప్లాట్లకు కన్వర్షన్
Huzurabad NALA Conversion Scam | హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ వెంచర్లకు అధికార ముద్ర పడిందా? వందలాది ప్లాట్లకు లేఅవుట్ అనుమతులు లేకుండానే నాన్-అగ్రికల్చర్ (ఎన్‌ఏ) కన్వర్షన్‌లు ఎలా జరిగాయి? ఈ ప్రశ్నలు ప్రస్తుతం హుజురాబాద్ రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కొన్ని రోజుల క్రితం బదిలీపై వెళ్లిన తహశీల్దార్ పాత్రపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
లేఅవుట్ అనుమతులు లేకుండానే కన్వర్షన్‌లు?
స్థానిక వర్గాల సమాచారం ప్రకారం, మున్సిపల్ అనుమతులు పొందకుండా అభివృద్ధి చేసిన పలు అక్రమ లేఅవుట్లలో వందలాది ప్లాట్లు విక్రయించబడ్డాయి. వ్యవసాయ భూముల్లోని అవే ప్లాట్లకు గజాల వారిగా కన్వర్షన్ చేయడం స్థానికంగా సంచలనం రేపుతోంది. లేఅవుట్ ఆమోదం, అభివృద్ధి ఛార్జీలు, ఓపెన్ స్పేస్ కేటాయింపులు వంటి కీలక నిబంధనలు అనేక నాన్ లేఅవుట్ వెంచర్ లలో అమలు కాలేదని విశ్వసనీయ సమాచారం. దీనివల్ల మున్సిపల్ శాఖకు రావలసిన అభివృద్ధి రుసుములు, ఫీజులు కోల్పోయి కోట్ల రూపాయల నష్టం జరిగి ఉండవచ్చని ప్రచారం సాగుతోంది.
రియల్టర్లకు లాభాల వర్షం?
ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యవసాయ భూమిని నివాస అవసరాలకు మార్చాలంటే సంబంధిత శాఖల అనుమతులు, మౌలిక వసతుల హామీలు తప్పనిసరి. అయితే అవేమీ పట్టించుకోకుండా హుజురాబాద్ మండల పరిధిలో అనేక అక్రమ వెంచర్లలోని ప్లాట్లను కన్వర్షన్ చేసినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.ఇదిలా ఉండగా, అక్రమ లేఅవుట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు నిరాకరించడంతో రియల్టర్ల దృష్టి తహశీల్దార్ కార్యాలయంపై పడిందని దాంతో ప్లాట్ల వారీగా కన్వర్షన్ లకు బదిలీ పై వెళ్లిన తహశీల్దార్ శ్రీకారం చుట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కో ప్లాటుకో ఏరియాను బట్టి సదరు తహశీల్దార్ కు రియల్టర్ లు ముట్టజెప్పినట్లు హుజురాబాద్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
NALA Conversion Scam : ఒకే సర్వే నంబర్‌కు పలు ‘బై నంబర్లు’?
ఒకే సర్వే నంబర్‌కు చెందిన భూమిని పలు భాగాలుగా విభజించి పదుల సంఖ్యలో బై నంబర్లు సృష్టించి కన్వర్షన్‌లు మంజూరు చేసి తద్వారా రిజిస్ట్రేషన్ లు చేసేసుకునేందుకు తహశీల్దార్ మార్గం సుగమం చేసినట్లు కార్యాలయ సిబ్బందే కోడైకూస్తున్నారు. ఈ విధానం ద్వారా సదరు తహశీల్దార్ అనుమతి లేని వెంచర్లకు చట్టబద్ధత కల్పించి, మున్సిపల్ ఆదాయానికి భారీగా గండికొట్టినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.
ప్రజాధనం నష్టపోతే బాధ్యత ఎవరిది?
గత రెండేళ్లుగా మండలం వ్యాప్తంగా ఏర్పడినటువంటి నాన్ లేఅవుట్ వెంచర్ మూలంగా హుజురాబాద్ మున్సిపాలిటీకి రావలసిన అభివృద్ధి రుసుములు, లేఅవుట్ ఛార్జీలు వసూలు కాలేదని సమాచారం. దీనిపై ఉన్నతాధికారులు లోతుగా విచారణ చేస్తే కన్వర్షన్ ల భాగోతంతోపాటు మున్సిపాలిటీ ఆదాయానికి ఎంత నష్టం జరిగిందో తెలుసుకోవచ్చని స్థానిక ప్రజా ప్రతినిధులతోపాటు, వివిధ ప్రజాసంఘాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.ఇటీవలే బదిలీపై వెళ్లిన తహశీల్దార్ ఈ విధంగా అనుమతి లేని వెంచర్ లలోని ప్లాట్లను నాలా కన్వర్షన్ చేయడం వల్ల హుజురాబాద్ మున్సిపాలిటీ ఆదాయానికి నష్టం వాటిల్లితే బాధ్యత ఎవరు తీసుకుంటారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
- కనకయ్య సారు మున్సిపల్ ఆదాయానికి గండి పడింది బాధ్యత ఎవరిది..?
- నాన్ లేఅవుట్ వెంచర్ లలోని వందలాది ప్లాట్లు నాల కన్వర్షన్ చేయడంలో మతలబేంటి?
- సర్వే నెంబర్ లు, పూర్తి ఆధారాలతో సర్కార్ లైవ్ ప్రచురించనుంది…
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








