Hyderabad rains : హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం మరో ప్రాణాన్ని బలిగొంది. ముషీరాబాద్‌కు చెందిన యువకుడు నిన్న అర్ధరాత్రి ఇంటికి తిరిగి వెళ్తుండగా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. గాలింపు అనంతరం అతడి మృతదేహాన్ని ఈరోజు ఉదయం బాల్కంపేట్ రైల్వే అండర్‌బ్రిడ్జ్ వద్ద పోలీసులు గుర్తించారు.
ప్రమాదం ఎలా జరిగిందంటే..
బుధవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో షరీఫుద్దీన్ (27) తన బైక్‌పై బాల్కంపేట్ నుంచి బేగంపేట్ వైపు వెళ్లాడు. ఒక్కసారిగా కురిసిన వర్షంతో రోడ్లు మొత్తం నీళ్లు ముంచెత్తాయి. బలమైన నీటి ప్రవాహాన్ని తట్టుకోలేక వాహనం సహా షరీఫ్ కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు రాత్రంతా గాలింపు చేపట్టినా ఆచూకీ లభించలేదు. చివరికి గురువారం ఉదయం అతడి మృతదేహం బాల్కంపేట్ అండర్‌పాస్ దగ్గర లభించింది.
Hyderabad లో వర్షపాతం ఇలా..
బుధవారం రాత్రి హైదరాబాద్ నగరంపై ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. మొదట తేలికపాటి జల్లులుగా మొదలైన వర్షం క్రమంగా వేగం పెంచుకుని మోస్తరు నుంచి భారీ వర్షంగా మారింది. సిరిలింగంపల్లి, మియాపూర్, చందానగర్, కూకట్‌పల్లి, ఆర్సీ పూరం, సికింద్రాబాద్ పరిసరాలు, మౌలాలి, హబ్సిగూడ, తార్నాక, ఈసీఆర్‌ఐఎల్, అల్‌వాల్, త్రిముల్గెర్రీ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది.
తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TGDPS) డేటా ప్రకారం చందానగర్‌లోని జేపీ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద గరిష్టంగా 97.5 mm వర్షపాతం నమోదైంది. లింగంపల్లి MMTS వద్ద 82.3 mm, హైదరాబాద్ విశ్వవిద్యాలయం వద్ద 81.3 mm, గచ్చిబౌలిలో 66.5 mm, చందానగర్ పీజీఆర్ స్టేడియంలో 64.8 mm వర్షం పడింది. రహదారులు నీటమునిగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్థంభించిపోయింది. విద్యుత్ సరఫరా అంతరాయం కారణంగా ఇళ్లలో చీకట్లు కమ్ముకున్నాయి. పాదచారులు, బైక్ రైడర్లు వర్షపు ప్రవాహాన్ని దాటలేక సతమతమయ్యారు.
ప్రజల్లో ఆగ్రహం
ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, నగరంలో డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేదని ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు వరద ముంపు నుంచి బయటపడకపోవడం, వాహనదారులు ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకరం అని చెబుతున్నారు. ఒక యువకుడి ప్రాణం వర్షపు బీభత్సానికి బలైపోవడం హైదరాబాద్ నగరంలో మళ్లీ ప్రాణభద్రతా సమస్యలపై చర్చను తెరపైకి తెచ్చింది. వర్షం పడినప్పుడల్లా మునిసిపల్ సిస్టమ్ ఎందుకు విఫలమవుతోందనే ప్రశ్నతలెత్తుతోంది. నగరంలో భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








