Hyderabad Metro Rail : కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలే ఆర్టీసీ బస్సు ఛార్జీలను 15 శాతం పెంచింది. మరోవైపు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) పెరుగుతున్న నిర్వహణ వ్యయాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మెట్రో ఛార్జీలను కూడా దాదాపు 43 శాతం పెంచాలని కర్ణాటక సర్కారు యోచిస్తోంది.
మెట్రో కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుంచి ఛార్జీలను సవరించలేదని BMRCL అధికారులు పేర్కొన్నారు. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, స్టేషన్లలో మౌలిక వసతులు, రైళ్ల నిర్వహణ, మహిళల కోసం ప్రత్యేక కోచ్‌లను అందించడం, సీనియర్ సిటిజన్లు, ఇతరులకు ప్రత్యేక సేవలను అందించడం వంటి అవసరాలను పరిగణనలోకి తీసుకుని, మెట్రో ఛార్జీలను పెంచాల్సి వస్తున్నదని BMRCL పేర్కొంది. ధరల సవరణ కమిటీ సిఫార్సుల ఆధారంగా ఛార్జీల పెంపుదలని బీఎంఆర్‌సీఎల్ ప్రతిపాదించింది. అయితే బీఎంఆర్‌సీఎల్ నిర్ణయం ప్రయాణికులకు ఏమాత్రం మింగుడు పడడం లేదు.
Hyd Metro Rail : హైదరాబాద్ మెట్రో ధరల పెంపు?
కర్ణాటక ప్రభుత్వం మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వం కూడా రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తోంది. ఇదిలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం కూడా బస్సు చార్జీలను పెంచే అవకాశం ఉందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఇంకా, BMRCL మెట్రో ఛార్జీలను పెంచాలని ప్రతిపాదిస్తున్నందున, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) కూడా దీనిని అనుసరించవచ్చని చాలా మంది భయపడుతున్నారు.
ఎల్ అండ్ టికి భారీ నష్టాలు..
కాగా హైదరాబాద్ మెట్రో (Metro Rail)ను నిర్వహిస్తున్న ఎల్‌అండ్‌టీ ఏడాదికి రూ.1,300 కోట్ల మేర భారీ నష్టాలను చవిచూస్తోందని, గత కొన్నేళ్లుగా రూ.6,000 కోట్ల నష్టాలు పేరుకుపోయాయని హెచ్‌ఎంఆర్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌వీఎస్ రెడ్డి గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. గత నవంబర్‌లో జరిగిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆడిట్ వీక్ కార్యక్రమంలో హెచ్‌ఎంఆర్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ.. బ్యాంకుల నుంచి అధిక వడ్డీకి రుణాలు తీసుకోవడం వల్లే అప్పుల భారం పెరిగి నష్టపోయామని చెప్పారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..