Hyderabad Tourism : దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ (Hyderabad) అనే పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది చారిత్రక కట్టడాలు. అద్భుతమైన వారసత్వ సంపద, సాంస్కృతిక వైవిధ్యం కలిగిన నగరం ఇది. చార్మినార్ (Charminar), గోల్కొండ కోట (Golconda Fort), సాలార్ జంగ్ మ్యూజియం, హుస్సేన్ సాగర్, ఫలక్‌నుమా ప్యాలెస్, కుతుబ్ షాహీ టూంబ్స్, చౌమహల్లా ప్యాలెస్ – ఇలా అనేక చారిత్రక, సాంస్కృతిక కేంద్రాలు ఈ నగరాన్ని విశేషంగా నిలబెడుతున్నాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది దేశ విదేశాల నుంచి ఈ నగరాన్ని సందర్శిస్తుంటారు.
హైదరాబాద్ ఐటీ హబ్ (IT Hub) గా మాత్రమే కాకుండా హెరిటేజ్ సిటీ (Heritage City)గా కూడా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. యునెస్కో (Unesco) వారసత్వ జాబితాలో చోటు పొందే స్థాయిలో కొన్ని కట్టడాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పర్యాటకులకు మరింత ఆకర్షణ కలిగించే కొత్త ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. రోప్‌వే ప్రాజెక్ట్‌తో పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
రోప్‌వే ప్రాజెక్ట్ HMDA కొత్త ప్రణాళిక
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) పర్యాటక (Tourism) రంగాన్ని ప్రోత్సహించేందుకు ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్ట్‌లను ఆవిష్కరిస్తోంది. తాజాగా గోల్కొండ కోట నుంచి కుతుబ్ షాహీ టూంబ్స్ వరకు రోప్‌వే నిర్మించాలని నిర్ణయించింది.
ఈ రోప్‌వే ప్రాజెక్ట్ పూర్తయితే పర్యాటకులు గోల్కొండ పైభాగం నుంచి ప్రారంభించి నేరుగా సెవన్ టూంబ్స్ ప్రాంతానికి చేరుకోవచ్చు. మధ్యలో ఉన్న అద్భుతమైన పచ్చదనం, చారిత్రక నిర్మాణాలు, హైదరాబాదీ వాతావరణాన్ని ఆస్వాదించే అవకాశం ఉంటుంది. రోప్‌వేలో ప్రయాణిస్తూ ఒకవైపు కోట గోడలు, మరోవైపు ఉద్యానవనాలు, దూరంలో మెరిసే హైదరాబాద్ నగర దృశ్యం కనిపించడం పర్యాటకులకు ఒక మరపురాని అనుభూతి అవుతుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే హైదరాబాద్ టూరిజం మ్యాప్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని అధికారులు అంటున్నారు.
Ropeway Project ప్రారంభమైతే…
ప్రస్తుతం పర్యాటకులు వేర్వేరుగా గోల్కొండ, కుతుబ్షాహి టూంబ్స్ (Qutb Shahi Tombs) ప్రాంతాలను సందర్శిస్తుంటారు. రవాణా సౌకర్యం పరిమితంగా ఉండటంతో చాలామంది కేవలం ఒకే ప్రదేశం చూసి వెళ్తున్నారు. రోప్‌వే ప్రారంభమైతే పర్యాటకులు ఒకే ప్యాకేజీలో గోల్కొండ, టూంబ్స్ రెండింటినీ సులభంగా సందర్శించొచ్చు. దీంతో టూరిస్టు ఫుట్‌ఫాల్ గణనీయంగా పెరగనుంది. స్థానిక గైడ్లు, హోటళ్లు, రవాణా సేవలకు కూడా మంచి డిమాండ్ వస్తుంది.
నైట్ ఫ్రాంక్ అధ్యయనం
ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాలను ఖరారు చేసేందుకు HMDA ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ను ఎంపిక చేసింది. ఈ సంస్థ వచ్చే మూడు నెలల్లో సమగ్ర నివేదికను సమర్పించనుంది. ఈ నివేదికలో రోప్‌వే నిర్మాణం సాధ్యాసాధ్యాలు, ఖర్చు అంచనా, పర్యావరణ ప్రభావం, టూరిజం పెరుగుదల, భవిష్యత్తు లాభనష్టాలపై విశ్లేషణలు ఉంటాయి. నివేదిక ఆధారంగా HMDA ప్రాజెక్ట్ ఫైనల్ ప్లాన్ రూపొందిస్తుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    