HYDRA రాష్ట్రంలోని చెరువులు, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేందుకు : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హైడ్రా.. కబ్జాదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇప్పటికే పలు చెరువులు, కుంటను కబ్జాదారుల చెర నుంచి రక్షించింది. వందల ఎకరాల మేర ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని, అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. తాజాగా జీహెచ్ఎంసీ పరిధి నెక్నాంపూర్ చెరువులో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని హైడ్రా అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా శుక్రవారం.. మణికొండలోని నెక్నాంపూర్ చెరువులో అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పనులను హైడ్రా అధికారులు ప్రారంభించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ ప్రక్రియ కొనసాగుతోంది.
రంగారెడ్డి జిల్లా మణికొండ ప్రాంతంలో విస్తరించిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా (HYDRA) స్పెషల్ ఫోకస్ పెట్టింది. చెరువును కబ్జా చేసిన భారీ భవనాలు నిర్మిస్తున్నట్లు ఇక్కడి నుంచి అనేక ఫిర్యాదులు అందడంతో వెంటనే స్పందించిన హైడ్రా రంగంలోకి దిగింది. నెక్నాంపూర్ చెరువు బఫర్ జోన్ లో భారీ నిర్మాణాలు కొనసాగుతున్నట్లు హైడ్రా అధికారులు తేల్చారు. వెంటనే హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు DRF సిబ్బంది కూల్చివేతలు మొదలుపెట్టారు.
HYDRA Police Station : త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్
ఇదిలా ఉండగా హైదరాబాద్లో హైడ్రా పోలీసు స్టేషన్ (HYDRA Police station) ను ఏర్పాటు చేసేందుకు చర్యలుచేపడుతున్నారు. బుద్ధ భవన్లోని బీ-బ్లాక్ కేంద్రంగా ఈ స్టేషన్ కార్యకలాపాలు సాగనున్నాయి. హైడ్రా స్టేషన్కు ఏసీపీ స్థాయి అధికారి స్టేషన్ హౌస్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తారు. ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీలు కూడా ఈ స్టేషన్ పరిధిలోకి వస్తాయి. సిబ్బంది, అధికారులు డిప్యూటేషన్ ప్రాతిపదికన నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ హైడ్రా పోలీస్ స్టేషన్ ను ప్రారంభించేందుకు రంగనాథ్ కార్యాచరణ సిద్ధం చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








