- IIT-H రూపొందించిన డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ బస్సు
- AI ఆధారిత కొత్త రవాణా విప్లవం
భారతదేశ రవాణా సాంకేతికతలో మరో ముఖ్యమైన ముందడుగు పడింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-హైదరాబాద్ (IIT Hyderabad) సరికొత్త ఆవిష్కరణ చేసింది. పూర్తిగా ఆటోనమస్ డ్రైవర్ లెస్ ( driverless bus) ఎలక్ట్రిక్ బస్సును ప్రారంభించింది. కృత్రిమ మేధస్సు (Artificial Intelligence – AI), ఆధునిక రోబోటిక్స్ విధానాలతో ఇది పనిచేస్తోంది.
ఎలా పనిచేస్తుంది?
ఈ డ్రైవర్‌లెస్ బస్సును హైదరాబాద్‌లోని ఒక స్టార్ట్‌అప్‌తో IIT-H అభివృద్ధి చేసింది. బస్సులో అత్యాధునిక సెన్సర్లు, హై-డెఫినిషన్ కెమెరాలు, లిడార్ (LiDAR) టెక్నాలజీ, AI ఆధారిత నావిగేషన్ సిస్టమ్స్‌ను అమర్చారు. ఈ బస్సు నడిచేటప్పుడు రోడ్డుపై అడ్డంకులను గుర్తిస్తుంది. ముందున్న మార్గాన్ని కచ్చితంగా గుర్తించి నావిగేట్ చేయడం, ట్రాఫిక్, వాతావరణ పరిస్థితులు మారినా తక్షణ నిర్ణయాలు తీసుకుని దానికి అనుగుణంగా కదలడం, పూర్తిగా డ్రైవర్ అవసరం లేకుండా ఆటోమేటిక్‌గా నడపడం దీని ప్రత్యేకత. ఈ బస్సు ఒకేసారి 15 మందిని తీసుకెళ్లగలదు. ఇది ప్రత్యేకంగా నియంత్రిత వాతావరణాల్లో (Controlled Environments) నడపడానికి రూపొందించారు.
IIT Hyderabad : పర్యావరణహిత ప్రయాణం
బస్సు పూర్తిగా ఎలక్ట్రిక్ శక్తిపై నడుస్తుంది. ఇంధన కాలుష్య రహితంగా దీన్ని రూపొందించడంతో పర్యావరణానికి ఎలాంటి హాని కలగదు. నిర్వహణ ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. భవిష్యత్తులో స్మార్ట్ సిటీలు, పరిశ్రమల ప్రాంతాలు, గేటెడ్ కమ్యూనిటీలలో ఇలాంటి రవాణా వ్యవస్థలు సులభంగా అమలు చేయొచ్చు.
ట్రయల్ ప్రక్రియ
ఈ బస్సు ఇంకా ట్రయల్ దశలో ఉందని IIT-H అధికారులు చెబుతున్నారు. దీని పనితీరు (Performance Evaluation), సామర్థ్యాన్ని పరీక్షించామని అంటున్నారు. భద్రతా ప్రమాణాలు (Safety Verification) ఎలా ఉన్నాయో కూడా పరిశీలిస్తున్నట్టు తెలిపారు. సాఫ్ట్‌వేర్ మెరుగుదల (Software Optimisation), వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించేలా AI అల్గారిథమ్స్‌ను అభివృద్ధి చేశామని చెబుతున్నారు. ప్రారంభ దశలో ఈ బస్సు IIT-H క్యాంపస్‌లోనే నడుస్తుందని తెలిపారు. భవిష్యత్తులో అవసరమైన నియంత్రణ అనుమతులు (Regulatory Clearance), మౌలిక సదుపాయాలు (Infrastructure) సిద్ధమైతే బహిరంగంగా రోడ్లపై కూడా నడిపే అవకాశం ఉందని అంటున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															







 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    