Army JCO killed :జమ్మూ కశ్మీర్‌లోని అఖ్నూర్ సెక్చన్‌లో ఉన్న లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) వద్ద తీవ్ర ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో భారత సైన్యానికి చెందిన ఓ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (Junior Commissioned Officer (JCO) వీర మరణం పొందారు. శుక్రవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. పాక్ సరిహద్దు ప్రాంతం కేరీ భట్టాల్ అటవీ ప్రాంతంలో ఒక చిన్న వాగు సమీపంలో ఆయుధాలతో సన్నద్ధంగా ఉన్న ఉగ్రవాదుల గుంపు చొరబాటు యత్నిస్తున్నట్టు గమనించిన భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. వారిని నిలిపేందుకు ప్రయత్నించగా ఉగ్రవాదులు తుపాకులతో కాల్పులకు పాల్పడ్డారు. ఈ సందర్భంగా తీవ్రంగా జరిగిన గన్‌ఫైట్‌లో ఓ జేసీవో (JCO) తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
Army : వరుస ఘటనలు.. వీరమరణాలు
ఈ సంఘటన అనంతరం ఆ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో ముట్టడి చేసిన భారత సైన్యం మిగతా ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోంది. మరిన్ని బలగాలను రంగంలోకి దింపినట్టు అధికారులు తెలిపారు. ఇదే ప్రాంతంలో ఈ సంవత్సరం ఫిబ్రవరి 11న కూడా ఓ ఘోర ఘటన జరిగింది. అప్పట్లో ఉగ్రవాదులు పేలుడు పదార్థాలను (IED) ఉపయోగించి దాడికి తెగబడ్డారు. ఆ దాడిలో ఓ ఆర్మీ కెప్టెన్ సహా మరో జవాన్ వీర మరణం పొందారు. మరో జవాన్ గాయపడ్డారు.
ఫ్లాగ్ మీటింగ్ జరిగిన రెండు రోజుల్లోనే
తాజా సంఘటనకు కేవలం రెండు రోజుల ముందు (ఏప్రిల్ 10న) భారత్-పాక్ మధ్య పూంచ్ జిల్లాలో బ్రిగేడ్ స్థాయి ఫ్లాగ్ మీటింగ్ (flag meeting) జరిగింది. సరిహద్దు పరిస్థితులపై చర్చించేందుకు ఈ సమావేశం జరిగినప్పటికీ ఆ తర్వాత ఈ కాల్పులు జరగడం కలవరం కలిగిస్తోంది. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 12 కాల్పుల విరామ ఉల్లంఘనలు, ఉగ్రదాడులు నమోదయ్యాయి. ఇక ఏప్రిల్ 5న కూడా జమ్మూ జిల్లాలోని ఆర్‌ఎస్ పురా సెక్టార్ వద్ద ఓ పాకిస్తానీ చొరబడినవాడిని బీఎస్ఎఫ్ జవాన్లు కాల్చి చంపారు. ఆ తర్వాత కూడా ఇండియా – పాకిస్తాన్ సరిహద్దు భద్రతా బలగాల మధ్య ఫ్లాగ్ మీటింగ్ జరిగింది.
ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్
భారత్ – పాకిస్తాన్ దేశాలు 2021 ఫిబ్రవరి 25న కొత్తగా కాల్పుల విరామ ఒప్పందం చేసుకున్నాయి. దాని తర్వాత ఇలాంటి ఉల్లంఘనలు చాలా తక్కువగా నమోదవుతున్నప్పటికీ ఇటీవల మళ్లీ దాడులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల నుంచి సూచనలు వచ్చినట్టు సమాచారం.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    