Indiramma Housing Scheme : రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) గురువారం హైదరాబాద్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల కాల్ సెంటర్ (Indiramma Housing Scheme Toll Free: 1800 599 5991)ను ప్రారంభించారు. ఈ కాల్ సెంటర్ ద్వారా లబ్ధిదారులు తమ సమస్యలు, సందేహాలు నేరుగా అధికారులకు తెలియజేసే అవకాశం కల్పించారు.
కాల్ సెంటర్ ప్రారంభోత్సవం తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి , ప్రజలకు మధ్య జరిగిన సంభాషణ ఆసక్తికరంగా సాగింంది. హలో నేను హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని మాట్లాడుతున్నాను… మీరు ఎక్కడినుంచి మాట్లాడుతున్నారు? మీ సమస్య ఏమిటి ? చెప్పండి.
ఫోన్ చేసిన వ్యక్తి :- సర్ మాది వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ మండలం .. బేస్మెంట్ వరకు మా ఇల్లు పూర్తి అయ్యింది. ఇంకా బిల్లు రాలేదు…
మంత్రి :- బేస్‌మెంట్ పూర్తయి ఎన్నిరోజులు అవుతుంది.. మీరు బేస్ మెంట్ పూర్తయిన ఫోటో అప్ లోడ్ చేశారా? ఫోన్ చేసిన వ్యక్తి :- చేశాం సార్,
మంత్రి:- మీ ఆధార్ నెంబర్ చెప్పండి.. (మంత్రి స్వయంగా ఆధార్ నెంబరును కంప్యూటర్ లో ఎంట్రీ చేసి వివరాలు పరిశీలించారు. మీ బిల్లు ఈఈ వద్ద ఉంది. వచ్చే సోమవారం నాడు మీకు రూ.లక్ష బిల్లు మీ బ్యాంకు అక్కౌంట్ లో జమ అవుతుంది. మీ ఊరిలో ఎన్నిఇండ్లు మంజూరయ్యాయి. ఇండ్ల నిర్మాణాలు ఎంతవరకు వచ్చాయి. ఇల్లు వచ్చినందుకు సంతోషంగా ఉన్నారా? అని పలు వివరాలను ఫోన్ చేసిన వ్యక్తిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఈ కాల్ సెంటర్ ప్రతి రోజూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటలవరకు పనిచేస్తుందని ప్రధానంగా ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Housing Scheme) లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించడంతోపాటు, వాటిని పరిష్కరించడంలో చొరవ చూపడానికి ఈ కాల్ సెంటర్ ను వినియోగించుకోవచ్చని అన్నారు. లబ్ధిదారుల ఫోన్ నెంబరు, ఆధార్ నెంబరు ఆధారంగా వివరాలను పరిశీలించి సమస్యను పరిష్కరించడానికి అధికారులు చర్యలు తీసుకుంటారని నిర్ణీత గడువులోగా బిల్లులు జమ కాకపోవడం, ఎక్కడైనా ఎవరైనా సిబ్బంది ఫోటోలను అప్ లోడ్ చేయడంలో ఆలస్యం చేయడం, ఇతర సాంకేతిక సమస్యలు, అవినీతి ఆరోపణలు తదితర అంశాలపై ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి, వాటిని సంబంధిత అధికారుల వద్దకు తీసుకెళ్లి చర్యలు తీసుకుని లబ్ధిదారులకు కూడా ఆ వివరాలను తెలియచేస్తారని వివరించారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో పారదర్శకతకు పెద్ద పీట వేస్తూ, పూర్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నామని, ఇప్పటికే ఇందిరమ్మ యాప్ ద్వారా మంచి ఫలితాలు సాధించామని, కృత్రిమ మేధ ( ఎఐ) ను కూడా విరివిగా వాడుతున్నామని, ఈ కాల్ సెంటర్ ద్వారా లబ్ధిదారులకు మరింత చేరువ అవుతున్నామని మంత్రి పేర్కొన్నారు. అవినీతికి ఎటువంటి ఆస్కారం లేకుండా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








