Infosys | ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ (Infosys co-founder Senapathy Kris Gopalakrishnan), ఐఐఎస్‌సీ డైరెక్టర్ బాలరాం (former IISc Director Balaram)తో పాటు మరో 16 మంది పై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఓ తప్పుడు కేసులో ఇరికిన తనను ఐఐఎస్‌సీ నుంచి నిర్దాక్షిణ్యంగా తొలగించడమే కాకుండా తనను కులం పేరుతో దూషించి అవమానపర్చారని ఓ వ్యక్తి వీరిపై ఫిర్యాదు చేశాడు. దీంతో బెంగళూరులోని సదాశివనగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఫిర్యాదుదారుడి ఆరోపణలు
తాను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) సెంటర్‌లోని సస్టైనబుల్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌లో ఫ్యాకల్టీగా పనిచేశానని దుర్గప్ప అనే వ్యక్తి తెలిపారు. 2014లో తాను ఒక హనీ ట్రాప్ కేసు (honey trap case)లో తప్పుడు ఆరోపణలపై ఇరికానని, దీనిని సాకుగా చూపించి ఐఐఎస్‌సీ నుంచి తొలగించారని పేర్కొన్నారు.
Infosys case : అట్రాసిటీ కేసే ఎందుకు?
బోవి తెగకు చెందిన వాడైన తనను ఉద్దేశపూర్వకంగానే ఉద్యోగం నుంచి తొలగించారని దుర్గప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో తనను కులం పేరుతో దూషించారని తెలిపారు. ఐఐఎస్‌సీలో కొందరి చేతిలో తాను కులవివక్షకు గురయ్యానని, తనపై బెదిరింపులకు సైతం పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు 18 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ (SC-ST Act) కేసు నమోదు చేశారు. బెంగళూరులోని 71వ సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు (సీసీహెచ్) నుంచి ఆదేశాలు వచ్చాకే పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు సమాచారం.
కేసు ఎవరెవరిపై నమోదైంది?
కేసు నమోదైన వారిలో క్రిస్ గోవిందన్ రంగరాజన్, శ్రీధర్ వారియర్, సంధ్యా విశ్వసరయ్య, కె.వి.ఎస్.హరి, దాసప్ప, పి.బాలరాం, హేమలత మిహిషి, కె.చటోపధ్యాయ, ప్రదీప్ డి.సావ్కర్, మనోహరన్ ఉన్నారు. క్రిస్ గోపాలకృష్ణన్ లేదా ఐఐఎస్‌సీ అధ్యాపక బృందం నుంచి ఈ కేసుపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు.
క్రిస్ గోపాలకృష్ణన్‌పై కేసు ఎందుకంటే..
గోపాలకృష్ణన్ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడిలో ఒకరు మాత్రమే కాకుండా ఐఐఎస్‌సీ ట్రస్టీ బోర్డు సభ్యుడిగా కూడా ఉన్నారు. ఉద్యోగం నుంచి తొలగింపునకు గోపాలకృష్ణన్ కూడా బాధ్యులే అని పేర్కొంటూ దుర్గప్ప ఫిర్యాదు చేయడంతో ఆయన సహా 18 మందిపై ఈ కేసు నమోదైంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    