Jawaharlal Nehru University : జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU)లో మరోసారి వివాదం చెలరేగింది. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీపై తీసిన నిషేధిత BBC డాక్యుమెంటరీని ఇక్కడ ప్రదర్శించడం కలకలం రేపింది. కొంత మంది విద్యార్థులు దీన్ని ప్రదర్శించగా విశ్వవిద్యాలయ పరిపాలన విభాగం అభ్యంతరం వ్యక్తం చేయడం, డాక్యుమెంటరీని ఆపకుంటే కఠిన చర్యలకు వెనకాడబోమని హోచ్చరికలు జారీ చేయడం, దీన్ని ఆ విద్యార్థులు ధిక్కరించడం ఉద్రిక్తంగా మారింది.
ప్రాజెక్టర్‌ను అనుమతించకపోవడంతో…
వామపక్ష అనుకూల అఖిల భారత విద్యార్థుల సమాఖ్య (AISF) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రదర్శన మొదట ప్రొజెక్టర్ ద్వారా చేయాలని భావించారు. అయితే.. భద్రతా సిబ్బంది ప్రొజెక్టర్‌ను అనుమతించలేదు. దీంతో విద్యార్థులు యూనివర్సిటీ క్యాంపస్‌లోని గంగా ధాబాలో ల్యాప్‌టాప్ ద్వారా డాక్యుమెంటరీని ప్రదర్శించారు.
JNU పరిపాలన విభాగం సీరియస్
విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొనొద్దని JNU పరిపాలన విభాగం హెచ్చరించింది. ఇది క్యాంపస్‌లో సామాజిక సమతుల్యతను దెబ్బతీసే చర్య అని పేర్కొంది. దీన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీన్ని AISF నాయకులు వ్యతిరేకించారు. ఇది భావప్రకటన, వ్యక్తిగత స్వేచ్ఛను అడ్డుకొనే చర్య అని ఆరోపించారు.
ఖండించిన AISF
విశ్వవిద్యాలయ పరిపాలన జారీ చేసిన హెచ్చరికను విద్యార్థుల మౌలిక హక్కులపై దాడిగా JNUSU ఒక ప్రకటనలో ఖండించింది. ‘JNU భద్రతా సిబ్బంది విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. JNUSU జాయింట్ సెక్రటరీపై దౌర్జన్యం చేశారు. వారు ప్రొజెక్టర్‌ను ధ్వంసం చేశారు. కానీ విద్యార్థులు ఈ నియంతృత్వానికి ముందు లొంగిపోలేదు. ఆ డాక్యుమెంటరీని వీక్షించారు’ అని AISF ప్రతినిధి తెలిపారు.
‘ప్రభుత్వాన్ని విమర్శించే డాక్యుమెంటరీల ప్రదర్శనను నిరోధించడానికి పరిపాలన ప్రయత్నిస్తుండటం దారుణం. అదే సమయంలో RSS-BJP కార్యక్రమాలను ప్రోత్సహించే సినిమాలను అనుమతించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనం’ అని పేర్కొంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..