బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా
Hyderabad : తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు జరిగితే అప్పుడు తమదే అధికారం అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా (JP Nadda) అన్నారు. దేశంలోని విపక్ష పార్టీలన్నీ ఏకమైనా.. మూడోసారి కూడా ప్రజలు మోదీ(PM Modi)నే ప్రధానిగా ఆమోదించారని తెలిపారు. ప్రస్తుతం దేశంలోని 13 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని ఆయన పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి మరో ఆరు రాష్ట్రాల్లో అధికారంలో ఉందని సూచించారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ మైదానంలో శనివారం జరిగిన బీజేపీ భారీ బహిరంగ సభలో జెపి.నడ్డా మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలు, 66 అబద్ధాలతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ఒక పరాన్నజీవి అనే సంగతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు.
ఇతర పార్టీలు బలహీనపడితే కాంగ్రెస్ (Congress) కు బలం అని అన్నారు. ఎక్కడైనా ప్రాంతీయ పార్టీల సహకారంతోనే కాంగ్రెస్ గెలుస్తూ వస్తోందని ఆయన విమర్శించారు. బీజేపీ నేరుగా పోటీ చేస్తున్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇంతవరకూ గెలవలేదని చెప్పారు. అధికారంలోకి వొచ్చిన ఏడాది నుంచి రేవంత్ రెడ్డి సర్కారు ప్రజలను మోసం చేస్తోందని అన్నారు. తెలంగాణకు పన్నుల కింద లక్షా 60 వేల కోట్ల సాయం కేంద్రం చేసిందని జెపి.నడ్డా గుర్తుచేశారు. తెలంగాణ మూడు వందేభారత్ రైళ్లు కూడా మంజూరు చేసిందని తెలిపారు. హైవేల కింద ఐదు భారత్‌మాల ప్రాజెక్టులు ఇచ్చినట్లు చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందని అన్నారు.