Justice Sujoy Paul : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజోయ్ పాల్ (Justice Sujoy Paul) నియమితులయ్యారు. బాంబే హైకోర్టుకు ఇటీవల బదిలీ అయిన జస్టిస్ అలోక్ అరధ్ (Justice Alok Aradh) స్థానంలో పాల్ బాధ్యతలు చేపడతారు.
నియామక ఉత్తర్వులు జారీ
జస్టిస్ పాల్ సీనియర్ న్యాయమూర్తి. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో జడ్జిగా ఉన్నారు. గతంలో మధ్యప్రదేశ్ హైకోర్టులో పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వచ్చారు. ఈ క్రమంలోనే
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా (Chief Justice of Telangana High Court) జస్టిస్ సుజోయ్ పాల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు ఆయన్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) నియమించినట్టు కేంద్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జస్టిస్ సుజోయ్ పాల్ నేపథ్యం ఇదీ…
మధ్యప్రదేశ్‌కు చెందిన జస్టిస్ సుజోయ్ పాల్ 1964న జూన్ 21న జన్మించారు. బీ.కాం, ఎం.ఏ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. 1990లో మధ్యప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయ్యారు. పండిట్ ఎల్.ఎస్.ఝా మోడల్ హైయర్ సెకండరీ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ రాణిదుర్గావతి విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎల్‌ఎల్‌బీ చేశారు. 1990లో మధ్యప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకున్న ఆయన సివిల్, రాజ్యాంగ, పారిశ్రామిక , సేవ తదితర విభాగాల్లో తన న్యాయవాద వృత్తిని కొనసాగించారు. 2011 మే 27న జబల్పూర్‌లోని మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జిగా ఆయన నియమితులయ్యారు. 2014 ఏప్రిల్ 14న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
కుమారుడు అదే కోర్టులో ఉండటంతో..
తన కుమారుడు అదే కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న దృష్ట్యా తనను మధ్యప్రదేశ్ హైకోర్టు నుంచి మరో హైకోర్టుకు బదిలీ చేయాలని గత ఏడాది ఫిబ్రవరిలో జస్టిస్ పాల్ సుప్రీంకోర్టు కొలేజియాన్ని కోరారు. ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2024 మార్చి 26న తెలంగాణ న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు.
జస్టిస్ అలోక్ అరధే స్థానంలో Justice Sujoy Paul
గతంలో కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ అలోక్ అరధే తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా 2023 జూలై 19న నియమితులయ్యారు. 2023 జూలై 23న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో ఆయన బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. దీంతో అలోక్ అరధే స్థానంలో సుజోయ్ పాల్ నియమితులయ్యారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..