Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరంలో దెబ్బతిన్న ముఖ్యమైన బ్యారేజీలను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు అవసరమైన కొత్త డిజైన్లను రూపొందించేందుకు అంతర్జాతీయ స్థాయి కంపెనీల నుంచి ఆహ్వానానికి నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ క్రమంలో జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ) దర్యాప్తు ఆధారంగా పునరుద్ధరణ చేయాలని నిర్ణయించింది. ఇక, వచ్చిన డిజైన్ టెండర్లను ప్రభుత్వం సీల్డ్ కవర్‌లో ఉంచుతుంది. ఈనెల 15న టెండర్లను ప్రభుత్వం తెరువనుంది.
కాగా, కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు ఈవోఐ పిలవాలని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా గత నెల 19న ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత కేవలం రెండు వారాల్లోగా డిజైన్ కన్సల్టెంట్‌ను ఎంపిక చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 
ఇక, ఎన్‌డీఎస్‌ఏ ప్రకారం, వానా కాలానికి ముందు, ఆ తర్వాత బ్యారేజీల వద్ద భూభౌతిక, భూసాంకేతిక పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే వర్షా కాలానికి ముందు చేపట్టాల్సిన పరీక్షలను అధికారులు పూర్తి చేశారు. అయితే, ప్రస్తుతం వరదల కారణంగా వర్షా కాలం తర్వాత చేయాల్సిన పరీక్షలకు బ్రేక్ పడింది. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీ (Kaleshwaram Project ) కి డిసెంబర్ లేదా జనవరి వరకు, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు నవంబర్ వరకు వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    