Kaleshwaram Project : కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ప్రాథమిక విచారణ (Preliminary Enquiry)ను ప్రారంభించింది. ప్రాజెక్టులో అవినీతి, అవకతవకలు, నిధుల దుర్వినియోగం జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ముందడుగు వేసింది. ఈ విషయాన్ని అధికారిక వర్గాలు ధృవీకరించాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) నిర్మాణంలో జరిగినట్లు ఆరోపిస్తున్న అనేక అవకతవకలపై సీబీఐ ఇప్పుడు సమగ్రంగా దర్యాప్తు చేపట్టనుంది. ప్రాథమిక విచారణలో ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పత్రాలు, ఒప్పందాలు, చెల్లింపుల వివరాలు, కాంట్రాక్టర్ కంపెనీల రికార్డులు, ఆర్థిక లావాదేవీలు వంటి అంశాలను పరిశీలించనుంది. ప్రధానంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) సమర్పించిన నివేదిక ఈ విచారణకు కీలక ఆధారంగా మారనుంది. ఇంజినీరింగ్ లోపాలు, నాణ్యతా ప్రమాణాల ఉల్లంఘనలు, నిర్మాణంలో తీసుకున్న అనుచిత నిర్ణయాలు వంటి అనేక అంశాలను ఆ నివేదికలో ప్రస్తావించినట్లు సమాచారం. దీనిని పరిశీలించిన అనంతరం సీబీఐ ఇప్పుడు వివిధ స్థాయిల్లో ఆధారాలను సేకరిస్తోంది.
FIR నమోదు చేసే అవకాశం!
ప్రాథమిక విచారణ పూర్తయిన తర్వాత ఎఫ్ఐఆర్ (First Information Report-FIR) నమోదు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. విచారణలో సరిపడా ఆధారాలు లభిస్తే అవినీతి కేసులో సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్ సంస్థలు, మధ్యవర్తులు తదితరులపై కేసులు నమోదు చేయొచ్చని తెలుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వ ఆరోపణలే ప్రధాన కారణం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రాజెక్టు వ్యయాలు అనవసరంగా పెంచడం, కాంట్రాక్టుల కేటాయింపుల్లో అసమానతలు, నిధుల దుర్వినియోగం, ప్రాజెక్టు లక్ష్యాల సాధనలో విఫలం వంటి అంశాలను ప్రస్తావించింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ప్రభుత్వం అధికారికంగా సీబీఐకి లేఖ రాసి పూర్తి స్థాయి విచారణ జరపాలని కోరింది.
Kaleshwaram Project: రాజకీయ పరిణామాలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపట్టిన అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్టుల్లో కాళేశ్వరం (Kaleswaram Project) ఒకటి. దీని పై విచారణ ప్రారంభం కావడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. రాబోయే రోజుల్లో ఈ కేసు రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని మరింత ఉత్కంఠంగా మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ముందున్న దర్యాప్తు దశలు
ప్రాజెక్టుకు సంబంధించిన పత్రాలను సీబీఐ సేకరించి పరిశీలించనుందని తెలుస్తోంది. కాంట్రాక్టర్ సంస్థల ఆర్థిక లావాదేవీలపై కూడా ఆరా తీయనుందని, సాంకేతిక నివేదికల, ప్రాజెక్టు మానిటరింగ్ రికార్డుల పరిశీలించనుందని సమాచారం. సంబంధిత అధికారుల, మాజీ అధికారుల విచారించనుందని తెలిసింది. ఈ దశలన్నీ పూర్తయిన తర్వాతే సీబీఐ తుది నిర్ణయం తీసుకుంటుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    