Karimnagar BRS Party | కరీంనగర్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్‌ఎస్ (BRS), బీజేపీ(BJP)ల మధ్య ఉన్న పొలిటికల్ వార్ అనేక మలుపులు తిరుగుతోంది. తాజా బీఆర్‌ఎస్ భారీ షాక్ తగిలింది. కరీంనగర్ మునిసిపల్ కార్పొషన్ (Karimnagar Municipal Corporation) మేయర్ సహా 10 మంది కార్పొరేటర్లు గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పారు. వీరంతా కమలం పార్టీ గూటికి చేరారు. బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) సమక్షంలో తీర్థం పుచ్చుకున్నారు.
అవినీతిని భరించలేకే : మేయర్
బీఆర్‌ఎస్‌లో అవినీతి పేరుకుపోవడం వల్లే తాము ఆ పార్టీని వీడామని మేయర్ యాదగిరి సునీల్‌రావు (Yadagiri Sunil Rao) వెల్లడించారు. బీఆర్‌ఎస్ హయాంలో రివర్ ఫ్రంట్, స్మార్ట్ సిటీ వంటి ప్రాజెక్టుల్లో భారీ స్కామ్ చోటు చేసుకుందని ఆరోపించారు. దీని వెనుక ఉన్న బీఆర్‌ఎస్ నేతల పేర్లను త్వరలోనే బయటపెడతానని తెలిపారు. “ఆ పార్టీకి నేను ఇక ఉపకారం చేయలేను. అవినీతిని భరించలేను” అని సునీల్‌రావు వ్యాఖ్యానించారు.
కార్పొరేషన్‌లో బలబలాలు
కరీంనగర్ కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. బీఆర్‌ఎస్‌కు 24 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఇప్పుడు 10 మంది కార్పొరేటర్లు బీజేపీలో చేరారు. దీంతో బీఆర్‌ఎస్ బలం 14కు పడిపోనుంది. బీజేపీ ఇప్పటికే 16 కార్పొరేటర్లను కలిగి ఉంది. కొత్తగా చేరిన 10 మంది కార్పొరేటర్లతో బీజేపీ బలం 26కు చేరింది. కాంగ్రెస్‌కు 12 మంది కార్పొరేటర్లు, ఎంఐఎంకు 8 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఈనెల 26వ తేదీతో కరీంనగర్ కార్పొరేషన్ పాలకమండలి గడువు ముగియనుంది. ఈ సమయంలో మేయర్, ఇతర కార్పొరేటర్లు పార్టీ మారడం రాజకీయ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది.
బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్
తెలంగాణలో బీజేపీ తమ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో ఆపరేషన్ ఆకర్ష్‌ను ప్రారంభించినట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌లో అసంతృప్తి ఉన్న నేతలను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తోంది. కరీంనగర్‌లో రాజకీయ ఆధిపత్యం సాధించాలనే లక్ష్యంతో ఉన్నట్లు స్పష్టమవుతోంది.
గంగుల, బండి మధ్య పొలిటిక్ వార్
కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ నేత గంగుల కమలాకర్ (Gangula Kamalakar), బీజేపీ నేత బండి సంజయ్ మధ్య రాజకీయం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల బండి సంజయ్ చేసిన కామెంట్లపై బీఆర్‌ఎస్ నేతలు భగ్గుమన్నారు. బీజేపీపై ప్రత్యారోపణలు చేశారు. ఈ పరిణామాలే సునీల్‌రావు బీజేపీలో చేరడానికి దారి తీశాయని తెలుస్తోంది.
Karimnagar లో ఊహించని రాజకీయ మలుపు
కరీంనగర్ రాజకీయాలు (Karimnagar Politics) ఇప్పుడు ఊహించని మలుపులు తీసుకుంటున్నాయి. బీఆర్‌ఎస్ నుంచి బీజేపీకి వలసలు, అవినీతి ఆరోపణలు లాంటి పరిణామాలు వేగంగా చోటుచేసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల ముందు కార్పొరేటర్లు, కీలక నేతలు పార్టీని వీడిపోవడం, బీజేపీకి బలం చేకూరడం బీఆర్‌ఎస్‌ను కలవర పెడుతున్నాయి. ఈ పరిస్థితి బీఆర్‌ఎస్ పెద్ద లోటుగా మారనుంది. బీజేపీ బలం పెరగడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. మరోవైపు మేయర్ సునీల్ రావు చేసిన అవినీతి ఆరోపణలు బీఆర్‌ఎస్ ప్రతిష్టపై మరింత ప్రభావం చూపొచ్చని విశ్లేషకులు అంటున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..