హైదరాబాద్ : ప్రజా సమస్యల పరిష్కారమే దిశగా రేవంత్ ప్రభుత్వంపై (Revanth Govt) క్షేత్రస్థాయిలో పోరాాటాలకు సిద్ధంకావాలని గులాబీ శ్రేణులకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) పిలుపునిచ్చారు. ఎర్రవల్లి ఫాంహౌస్‌లో మంగళవారం (జులై 29) బీఆర్ఎస్ శ్రేణులతో కేసీఆర్ సమావేశమయ్యారు.
రైతుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి ఆంధ్రా ప్రయోజనాలను కాపాడేందుకు స్వయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే పాలనా విధానాలను అమలుచేయడం దుర్మార్గమని అన్నారు. ఇక్కడ చంద్రబాబు..అక్కడ మోదీల ప్రయోజనాలను కాపాడేందుకు సీఎం తహతహ లాడుతున్నాడని, దీనిని తెలంగాణ సమాజం గమనిస్తున్నదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశాపూర్వకంగా పండబెట్టి.. వానాకాలం నాట్లు దగ్గరపడుతున్నా కూడా.. ఇంతవరకు రైతాంగానికి సాగునీరు అందించని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రజాక్షేత్రంలో నిలదీయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర గోదావరి జలాలను ఎత్తిపోయాలని, పంపులను ఆన్ చేయాలని, చెరువులు కుంటలు రిజర్వాయర్లను నింపాలని డిమాండ్ చేశారు.
రేవంత్ ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో రాష్ట్ర రైతాంగ సంక్షేమం, వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడం కోసం రాజీలేని పోరాటాలు మరింత ఉధృతం చేయాలని KCR దిశానిర్దేశం చేశారు. తెలంగాణ సాగునీటి రంగాన్ని ఆగం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించనున్న బనకచర్ల ప్రాజెక్ట్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ నిలువరించాల్సిందేనని కేసీఆర్ ఆదేశించారు. అందుకు బీఆర్ఎస్ శ్రేణులను క్షేత్ర స్థాయిలో పోరాటాల కోసం కార్యోన్ముఖులను చేయాలని మార్గనిర్దేశం చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు తన్నీరు హరీష్‌రావు, జి. జగదీశ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.