- గొర్రెకుంట రెవెన్యూ పరిధిలోని హౌజింగ్ బోర్డు భూమి అన్యాక్రాంతం
- అధికారుల ‘స్వామి’ భక్తి.. రియల్టర్ల ‘ప్రసాదం’!
- అశోక హోటల్ కేంద్రంగా చక్రం తిప్పుతున్న ‘అదృశ్య’ శక్తులు
కీర్తినగర్ హౌజింగ్ బోర్డు ప్రభుత్వ భూములకు (Keerthinagar Housing Board Land) రక్షణ కరువైందా? ఉన్నతాధికారుల ఆదేశాలకు కింది స్థాయి సిబ్బంది వద్ద విలువే లేకుండా పోయిందా? అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట రెవెన్యూ శివారులోని సర్వే నెం. 561, 562లో కోట్లాది రూపాయల విలువైన హౌజింగ్ బోర్డు భూమి కబ్జా కోరల్లో చిక్కుకున్నా, రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం వెనుక భారీ ‘స్కెచ్’ ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Housing Board Land issue : ఏమిటా వివాదం?
1983లో హౌజింగ్ బోర్డు వద్దిరాజు శంకర్రావు అనే భూస్వామి నుండి 145.15 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఇందులో 121 ఎకరాల్లో కాలనీ నిర్మించగా, మిగిలిన 19 ఎకరాల భూమి లెక్క తేలాల్సి ఉంది. సుమారు 40 ఏళ్ల తర్వాత మేల్కొన్న అధికారులు, ఆ 19 ఎకరాలకు హద్దులు నిర్ణయించాలని రెవెన్యూ శాఖకు ఫిర్యాదు చేశారు. ఇందులో నుండి ఇప్పటికే సర్వే నెంబర్ 561లో ఇ 2 నుండి 3 ఎకరాలు అక్రమ డాక్యుమెంట్లతో ఆక్రమణకు గురైనట్లు తెలుస్తోంది. సర్వే చేయాలని ఆర్డీవో ఆదేశాలు జారీ చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఆక్రమణకు గురైన భూమి విలువ సుమారు 30 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఈ భూమిని కాజేయడానికి రియల్టర్లు, హౌజింగ్ బోర్డు, రెవెన్యూ అధికారులకు భారీగా ముడుపులు చెల్లించారనే ప్రచారం స్థానికంగా కలకలం రేపుతోంది.
అశోక హోటల్ కేంద్రంగా రియల్ ‘చక్రం’!
ఈ భూ కబ్జా వెనుక హన్మకొండలోని ఒక ప్రముఖ అశోక హోటల్ కేంద్రంగా ఒక రియల్టర్ చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. అక్కడే వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధమవుతున్నాయని, అధికారులను ప్రసన్నం చేసుకునే పర్వానికి ఆ హోటలే వేదికగా మారుతోందని స్థానికంగా చర్చ జరుగుతోంది. సర్వే జరగకుండా, హద్దులు పడకుండా అడ్డుపడుతున్న ఆ ‘అదృశ్య శక్తి’ ఎవరా అన్నది ఇప్పుడు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
‘స్వామి’ భక్తిలో అధికారులు.. సర్వే ఎప్పుడు?
ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన కొందరు అధికారులు విధి నిర్వహణను పక్కనపెట్టి, సదరు రియల్టర్ పట్ల ‘స్వామి భక్తి’ని చాటుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బాధ్యత గల అధికారులు తరచూ ఆ రియల్టర్ కనుసన్నల్లో మెలుగుతూ, ఆయన ఇచ్చే ‘ప్రసాదాల’ (మామూళ్లు) రుచికి అలవాటు పడి ఆర్డీవో ఆదేశాలను బుట్టదాఖలు చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తూ కబ్జాదారులకు పరోక్షంగా సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మేడం.. హౌజింగ్ బోర్డు భూమిని కాపాడండి!
ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన రెవెన్యూ శాఖ ఇలా మౌనంగా ఉంటే, ఇక సామాన్యుడి ఆస్తులకు రక్షణ ఎక్కడ ఉంటుంది? ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి, తక్షణమే హౌజింగ్ బోర్డు భూమిని సర్వే చేసి స్పష్టమైన హద్దులు కేటాయించాలని కీర్తినగర్ వాసులు డిమాండ్ చేస్తున్నారు. రియల్టర్ల మాయాజాలంలో చిక్కుకున్న ప్రభుత్వ భూమి మళ్ళీ హౌజింగ్ బోర్డు వశమవుతుందా? లేక ‘అశోక’ వ్యూహం ముందు అధికార యంత్రాంగం తలవంచుతుందా? అనేది వేచి చూడాలి.








