Pamban Bridge : తమిళనాడులోని రామేశ్వరం వద్ద నిర్మించిన అద్భుతమైన పంబన్ వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జి (Vertical Lift Sea Bridge)ని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రారంభించారు. రిమోట్ ద్వారా ఈ వంతెనను ఆవిష్కరించారు. మోదీ ప్రారంభించగానే ఆ వంతెన లిఫ్ట్‌లా పైకి లేచింది. ఒక భారీ నౌక దాని కింద నుంచి దూసుకెళ్లింది. ఈ అద్భుత దృశ్యం చూపురులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రపంచంలో అరుదైన ఇంజనీరింగ్ వండర్‌గా నిలిచే ఈ వంతెనను శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా మోదీ ప్రారంభించడం విశేషం.
పంబన్ బ్రిడ్జి.. వందేళ్ల చరిత్ర
పాత పంబన్ రైల్వే బ్రిడ్జి భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ప్రాముఖ్యత పొందిన వంతెన. ఇది 1914లో నిర్మితమైంది. ఈ వంతెన ప్రత్యేకత ఏమిటంటే.. ఇది ఓపెన్ చేయగల రెండు భాగాలతో తయారు చేయబడింది. నౌకలు వచ్చినప్పుడు అది మడవబడుతూ వాటికి దారి ఇస్తుంది. అయితే.. వందేళ్ల ఈ పాత వంతెన ఉపయోగంలో ఉండటం అంత సురక్షితం కాదని గుర్తించిన కేంద్రం ఆధునిక సాంకేతికతతో కొత్త వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
Pamban Bridge .. అద్భుత ఇంజనీరింగ్
ఈ వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జిని అత్యాధునిక ఇంజనీరింగ్ (Pamban Bridge Engineering) పరిజ్ఞానంతో నిర్మించారు. భారతదేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జి (India’s First Vertical Lift Sea Bridge) ఇదే. రూ.535 కోట్లతో దీన్ని నిర్మించారు. దీని మొత్తం పొడవు 2.08 కిలోమీటర్లు. లిఫ్ట్ భాగం పొడవు 72.5 మీటర్లు, ఎత్తు 17 మీటర్లు. నౌకలకు దారి ఇవ్వడం కోసం వర్టికల్ లిఫ్ట్ మెకానిజాన్ని ఇందులో పొందుపర్చారు. ఈ బ్రిడ్జి నిర్మాణంలో స్టెయిన్‌లెస్ స్టీల్‌ను వాడారు. ఇది ఎప్పటికీ తుప్పు పట్టదు. ఈ వంతెన నావికా దళాల నుంచి పెద్ద పెద్ద నౌకలు వెళ్తున్నప్పుడు లిఫ్ట్ పైకి లేచి వాటికి అవసరమైన స్పేస్‌ను ఇస్తుంది. దీని ద్వారా రైలు మార్గం కూడా అంతరాయం లేకుండా కొనసాగుతుంది.
సాంస్కృతిక వారసత్వానికకీ ప్రతీక
రామేశ్వరం ప్రాంతానికి హిందూ పురాణాల్లో ముఖ్యమైన స్థానం ఉంది. రామాయణ ప్రకారం శ్రీరాముడు వానర సేనతో కలిసి రామేశ్వరం దగ్గరి నుంచి లంక వైపు రామసేతు నిర్మించాడని హిందువుల విశ్వాసం. ఇలా పంబన్ వంతెన ఓ భౌతిక నిర్మాణం మాత్రమే కాదు.. సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక కూడా.
ఈ వంతెన వల్ల రామేశ్వరం వంటి పుణ్యక్షేత్రానికి రైల్వే సౌలభ్యం మరింత మెరుగవుతుంది. అలాగే కోస్ట్ గార్డ్, నౌకాదళానికి సంబంధించి నౌకల రాకపోకలు కూడా నిరవధికంగా కొనసాగుతాయి. పాత వంతెనను మూసివేసి, కొత్త వంతెన ప్రారంభించడంతో రక్షణ, వేగం, సామర్థ్యం.. అన్నింటిలోనూ మెరుగుదల ఉంటుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.