Hyderabad | లగచర్ల (Lagacharla) భూసేకరణ బాధితులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) భరోసా ఇచ్చారు. భూసేకరణ రద్దు చేసేవరకు పోరాటం ఆపబోమని ఆయన స్పష్టం చేశారు. ఈమేరకు శనివారం లగచర్ల బాధితులు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పోరాటంలో బాధితులకు అండగా ఉంటామని చెప్పారు. ప్రభుత్వం వేధింపులను ఇప్పటికైనా మానుకొని బాధితుల డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా లగచర్లలో భూసేకరణ రద్దు అయ్యే వరకూ బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని కేటీఆర్ వారితో అన్నారు.
గిరిజన భూసేకరణ బాధితులపై రేవంత్ (CM Revanth Reddy) ప్రభుత్వం అన్యాయంగా పెట్టిన కేసులను భేషరతుగా ఉపసంహరించుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. పోలీసుల ద్వారా లగచర్ల బాధితులను వేధించడం నిలిపివేయాలని.. ప్రజలకు అండగా ఉండాల్సిన సర్కారు ఇలా చేయడం మంచిదికాదని హితువు పలికారు. వికారాబాద్ జిల్లా ఎస్పీతో ఫోన్‌లో కేటీఆర్ మాట్లాడారు. బాధితులపై అక్రమ కేసులను పెట్టొద్దని కోరారు. లగచర్ల బాధితులు చేసిన ఉద్యమానికి ప్రభుత్వం తలవంచి నోటిఫికేషన్ రద్దు చేసుకుందని చెప్పారు. కానీ మరోసారి అవే భూములను ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో లాక్కోవొద్దని, నోటిఫికేషన్‌ను పూర్తిగా రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రజల అభ్యర్థనలను పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు.
గిరిజన భూములను వదిలేసి, వెల్దండలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబానికి చెందిన 500 ఎకరాల భూములను పరిశ్రమల కోసం ఉపయోగించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గిరిజనుల భూములు గుంజుకోవడం ముఖ్యమంత్రి దుర్మార్గానికి నిదర్శనమని మండిపడ్డారు. జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి తరపున, అక్రమంగా కేసులతో జైల్లో ఉన్న బాధితుల పక్షాన బిఆర్ఎస్ న్యాయపోరాటానికి అండగా ఉంటుందని కేటీఆర్ తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు సత్య వతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.